26 February, 2026 | 1:59 AM

సూపర్ సేవలకు మంగళం?

26-02-2026 12:00 AM

ఇప్పటికే సూపర్ బజార్ మూసివేత

తాజాగా సూపర్ గోదాం విలీనానికి యత్నాలు

బెల్లంపల్లి కార్మికులకు సింగరేణి సేవలు శూన్యం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కార్మికులకు సింగరేణి సేవలు రాను రాను దూరమవుతున్నాయి. ఇప్పటికే పట్టణ కేంద్రంగా ఉన్న సింగరేణి సూపర్ బజార్‌ను బంద్ చేశారు. తాజాగా సౌత్ క్రాస్ కట్ వద్ద ఉన్న సింగరేణి సూపర్ బజార్ గోదాముపై సింగరేణి కన్ను పడింది. దీన్ని కూడా నిర్వీర్యం చేసే చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్ లో విలీనం చేసేందుకు యజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే జరిగితే స్థానిక సింగరేణి కార్మిక కుటుంబాలకు కంపెనీ పరంగా సూపర్ బజార్ సేవలకు చెక్ పడినట్లేననే అభిప్రాయాలు నిజం కానున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలకు చౌక ధరలతో నిత్యవసర సరుకులు అందించేందుకు సింగరేణి సూపర్ బజార్లకు శ్రీకారం చుట్టారు.

సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో సింగరేణి సూపర్ బజార్లు ఉనికిలోకి వచ్చాయి. కార్మికులకు యజమాన్యం తక్కువ ధరలకు నిత్యవసర సరుకులు, దినుసులను అందించడం యజమాన్యం ఒకప్పుడు బాధ్యతగా భావించింది. అది కాస్త రానురాను సన్నగిళ్ళుతూ వచ్చింది. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ సింగరేణి ప్రాంతాల్లో సింగరేణి సూపర్ బజార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల యాజమాన్యం పరిపాలన వ్యవహారాల్లో చోటు చేసుకున్న సంస్కరణలు సంక్షేమంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 2౫: యాజమాన్యంలో వచ్చిన నూతన సంస్కరణ దృక్పథం కార్మిక సేవా రంగానికి గొడ్డలి పెట్టుగా మారిందనీ విమర్శలు ఉన్నాయి. సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. అంతటితో కాకుండా యజమాన్యం మరింత దూకుడుగా సంక్షేమ చర్యల కుదింపునకు పూనుకుంది. అందులో భాగంగానే తొలుత రామకృష్ణపూర్ లో సింగరేణి సూపర్ బజార్ ను ఎత్తివేశారు. కొద్ది కాలానికి ఆ కత్తిరింపు చర్యలు బెల్లంపల్లికి విస్తరించారు.

పట్టణ నడిబొడ్డున ఉన్న బెల్లంపల్లి సింగరేణి సూపర్ బజార్‌ను కూడా మూసివేశారు. యజమా న్యం నష్ట లాభాలు, నిర్వాహణ లోపం వంటి కుంటి సాకులను చూపిస్తోంది. లాభాల కోసం సింగరేణిలో సూపర్ బజార్లు అవతరించలేద నే విషయాన్ని యజమాన్యం విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారం కోసం సూపర్ బజార్లను ఏర్పాటు చేయలేదని, కార్మికుల సంక్షోభానికి మాత్రమే సూపర్ బజార్లో ఏర్పాటు జరిగిందనే విషయాన్ని యజమాన్యం మర్చిపోయి సంక్షేమ చర్యలను నియంత్రిస్తుందన్న విమర్శలు బగ్గుమన్నాయి. 

మూసివేత ఎవరి కోసం...

సింగరేణిలో సంక్షేమ చర్యలు అమలు తీరు, మూల విధానం కాలక్రమంలో తలకిందులు అయింది. కార్మికుల సంక్షేమమే లక్ష్యం గా సింగరేణిలో సూపర్ బజార్లు, గోదాములు ఏర్పాటు చేశారు. ఎత్తివేత క్రమంలో కారణాలను అధికారులు కొత్తగా చెబుతున్నారని విమర్శలు వ్యక్తమవు తున్నాయి. చౌక ధరలతో సకల సరుకులు సింగరేణి కార్మికులకు అందిస్తే సూపర్ బజార్లు ఎలా నష్టపోతాయని ప్రశ్న ఉత్పన్న అవుతుంది.

పొదుపు చర్యల్లో భాగంగా సంక్షేమ రంగంలో కూడా ఖర్చు తగ్గించడానికే ఇలా సూపర్ బజార్లు, గోదాములను ఎత్తివేసి ఎన్ని కోట్లు వెనకేసుకుంటారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మికుల సంక్షేమానికి కేటాయించినా బడ్జెట్‌ను వృథా ఖర్చు కింద భావించడంలోనే యజమాన్యం కార్మిక వ్యతిరేకత ఉందని పలువురు అంటున్నారు. కార్మికుల సంక్షేమం కోసంపెట్టే ఖర్చు వృథా ఎలా అవుతుందని అంటున్నారు. 

విలీనం కాదు ఎత్తివేత..?

బెల్లంపల్లిలో ఉన్న సింగరేణి సూపర్ బజా ర్ గోదాంను యజమాన్యం వీలినం పేరిట ఎత్తివేసే కుట్రకే పూనుకుందని కార్మికులు అనుమానిస్తున్నారు. మందమర్రి ఏరియా పరిధిలో ఉన్న గోదామును శ్రీరాంపూర్ ఏరియాలో వీలిన చేయడం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాశ్వత మూసివేతలో భాగంగానే సింగరేణి సూపర్ బజార్ గోదామును విలీనం పేరిట ఏరియా నుంచి మెల్లగా దాటస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే  బెల్లంపల్లిలో ఉన్న సూపర్ బజార్ ఎత్తివేతనీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

ఇలా ఒక్కొకటిగా సంక్షేమ రంగాలను అధికారులు నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు. చివరి ఘట్టంగా మిగిలిన  బెల్లంపల్లి సింగరేణి గోదాముకు కూడా చరమగీతం పాడుతున్నారు.  దీంతో శాంతిఖని, బెల్లంపల్లి ఏరియాస్పత్రీ,గోలేటి, కైరిగూడ, కాసిపేట వన్, టూ, కేకే 5,కే కే ఓ సీ క్యాంటీన్లకు ప్రస్తుతం ఉన్న సూపర్ బజార్ గోదావరి నుంచే సరుకులు సరఫరా చేస్తున్నారు. విలీనం అనంతరం ఇక సేవలు జాప్యానికి గురవుతాయి. రవాణా ఖర్చు తడిసి మోపడుతుంది.

దీని ప్రభావం క్రమంగా ఉద్యోగులు, బొగ్గు గనుల కార్మికులు పొందుతున్న సంక్షేమ సేవల పై ప్రతికూలంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే సింగరేణి ఉద్యోగులు,కార్మికుల కు అందుతున్న సేవల్లో కోతలు పడుతున్నాయి. ఇక తాజా చేపట్టిన చర్యలతో కార్మికులు, ఉద్యోగుల  సంక్షేమం ఓ కల గా మిగిలిపోతుందనే అభిప్రాయాలు నిజం కాకపోవు. ఇప్పటికైనా అధికారులు బెల్లంపల్లి సూపర్ బజార్ గోదామును విలీనం ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ప్రేక్షక పాత్రలో సంఘాలు

సింగరేణిలో కార్మిక సంక్షేమానికి ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సంక్షేమానికి యజమాన్యం కొర్రీలు పెడుతూ వస్తుంది. కార్మిక సంక్షేమం పట్ల యాజమాన్యం ఆలోచనలో మారిన విధానంపై. కార్మిక సంఘాలు మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్క ప్రాంతం నుంచి కార్మిక సేవ రంగాలు కనుమరుగుతుంటే.. ప్రధాన కార్మిక సంఘాలు నోరు మెదపకపోవడం పరోక్షంగా కంపెనీ విధానాలకే వత్తాసనే సంకేతాలుగా కార్మికులు భావిస్తున్నారు. రామకృష్ణాపూర్, బెల్లంపల్లి లోని సూపర్ బజార్లు ఎత్తివేతపై ఒక కార్మిక సంఘం కూడా స్పందించలేదు. దీన్ని ఆసరా చేసుకొని. యజమాన్యం తాజాగా బెల్లంపల్లిలో సూపర్ బజార్ గోదామును శ్రీరాంపూర్ లో విలీనం చేసే చర్యలకు తెరతీస్తుంది.

ఇలా అయితే బెల్లంపల్లి ప్రాంత కార్మిక కుటుంబాలకు సింగరేణి సంక్షేమ చర్యలు పూర్తిగా దూరమైనట్టే. కార్మిక సంఘాలు కంపెనీ ఏమి చేసినా స్పందించకపోవడంపై కార్మికుల్లో పెద్దఎత్తునా చర్చ జరుగుతుంది. అసలు సింగరేణిలో కార్మిక సంఘాలు బ్రతికే ఉన్నాయా ? అనే అనుమానాలను సైతం వ్యక్తం అవుతున్నాయి. ఏమి జరిగినా కార్మికులు ఎంత నష్టపోయినా తమకేమి పట్టనట్టుగా కార్మిక సంఘాలు కఠినాత్పకంగా మౌన వహించడం మించిన ద్రోహం మరొకటి లేదని కార్మిక శ్రేయోభిలాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.