పెద్దపల్లి ప్రజాతీర్పును గౌరవిస్తా
- ప్రజల మధ్యనే ఉంటా
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
మంథని, జూన్ 5 (విజయక్రాంతి): బాధ్యత గల నాయకుడిగా పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తానని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటానని స్పష్టంచేశారు. పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన బీఆర్ ఎస్ అధి నేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు.
తాను ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం బిడ్డగా, ఇక్కడి సమస్యలు తెలిసిన వ్యక్తిగా అనేక సమస్యలను పరిష్కరించేవాడనని అన్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండటంతోనే ప్రజలు జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకొని ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుదామని, లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల హామీలను అమలు చేసేలా పోరాడుతామని చెప్పారు. తనను ఆదరించి ఓటు వేసిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు గోపు ఐలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.






