మిల్లర్లు.. సర్కారీ అల్లుళ్లు!
అత్తగారి సొమ్ములా సీఎంఆర్‌కు ఎసరు
మంచిర్యాల జిల్లాలో డిఫాల్టర్‌గా 21మిల్లులు
పెండింగ్‌లో 5,918 మెట్రిక్ టన్నుల బియ్యం
కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ హెచ్చరిక
మంచిర్యాల, జూన్ 5 (విజయక్రాంతి) : రైస్ మిల్లరు సర్కారీకే అల్లుళ్లుగా వ్యవహరిస్తున్నారు. అత్తగారి సొమ్ములా సీఎంఆర్ బియ్యాన్ని అప్పనంగా మింగేస్తున్నారు. ప్రభుత్వానికే చుక్కలు చూపిస్తున్నారు. సాధారణంగా కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఈ విషయంలో చాలామంది మిల్లర్లు మొండికేస్తున్నారు. సీఎంఆర్ సొమ్ముతో దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క మంచిర్యాల జిల్లాలోనే మిల్లర్ల వద్ద 2022 వాన కాలానికి సంబంధించి 5,918.259 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లో ఉంది. ఇందులో కొంత బియ్యాన్ని 25 శాతం ఫెనాల్టీ, 12 శాతం వడ్డీతో కలిపి రాబట్టడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహ రిస్తున్నది. సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడింది. ఇందులో భాగంగా ఇటీవల ఇందారంలోని శివసాయి మల్లిఖార్జున ట్రేడర్స్ యాజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
డిఫాల్టర్‌గా 21 మిల్లులు..
జిల్లాలో ప్రస్తుతం 21 మిల్లులు సీఎంఆర్ ఇవ్వక డిఫాల్టులోకి వెళ్లాయి. లక్ష్మీగణపతి పీబీఆర్‌ఎం అందుగులపేట, కనకమహాలక్ష్మీ కిష్టంపేట చెన్నూర్, లక్ష్మీ నరసింహా రైస్ మిల్ కలమడుగు, బీఎస్‌వై రా రైస్ మిల్ ముదిగుంట జైపూర్, బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ టేకుమట్ల, శివసాయి మల్లిఖార్జున ట్రేడర్స్ ఇందారం, రామ లక్ష్మణ్ ఇండస్ట్రీ లింగాపూర్ దండేపల్లి, వెంకటరమణ రైస్‌మిల్ పెద్దంపేట, సప్తగిరి ఆగ్రో ఇండస్ట్రీస్ మందమర్రి, మణికంట రైస్‌మిల్ తాళ్లపేట, రాధాక్రిష్ణ ఇండస్ట్రీస్ కన్నెపల్లి దండేపల్లి, జయలక్ష్మీ ఇండస్ట్రీస్, రాజ రాజేశ్వరి ట్రేడర్స్, నీలం బ్రదర్స్ మోడ్రన్ రైస్ మిల్, దుర్గా ఇండస్ట్రీస్, అన్నపూర్ణ ఆగ్రో మోడ్రన్ రైస్ మిల్, శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, వెంకటేశ్వర రైస్ మిల్ మందమర్రి, జయలక్ష్మీ మినీ మోడ్రన్ రైస్ మిల్, నాగయ్య రైస్ మిల్, శ్రీ రాజరాజేశ్వర మోడ్రన్ రైస్ మిల్‌లు డిఫాల్ట్‌లోకి వెళ్లాయి.
ఈ 21 మిల్లులకు 43,096.792 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయిస్తే 23,123.668 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి పెట్టగా ఇంకా 5,918.259 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉన్నారు. గడువులోపు బియ్యం ఇవ్వకపోవడంతో 25 శాతం ఫెనాల్టీ కింద 1,479.565 మెట్రిక్ టన్నుల కలుపుకొని ఇంకా ప్రభుత్వానికి 7,397.824 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఆలస్యమైనందుకు ప్రభుత్వానికి ఇచ్చే ధాన్యం విలువ మీద 12 శాతం వడ్డీతో కలుపుకొని సివిల్ సప్లయ్ సంస్థ రూ. 42,48,386 వసూలు చేయనుంది.






