బీజేపీలోకి పెద్దిరెడ్డి

30-04-2024 02:19:37 AM

కమలం కండువా కప్పుకొన్న వెంకటేశ్ నేత

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి పార్టీ కండువాలు కప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేశ్ నేత తనకు పెద్దపల్లి నుంచి టిక్కెట్ వస్తుందని ఆశించారు. కానీ ఆ పార్టీ నుంచి ఎలాంటి హామీ రాకపోవటంతో బీజేపీ గూటికి చేరారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి కూడా తిరిగి సొంతగూటికి వచ్చారు. వీరితో పాటు మంథని సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, నాంపల్లికి చెందిన మైనారిటీ నాయకుడు సిద్ధిఖీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కాంతారెడ్డి, భూపాలపల్లి జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ రాజేష్ నాయక్, తంగెళ్లపల్లి లక్ష్మణ్, జగదీశ్వర్‌రావు తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురుగన్ పాల్గొన్నారు. 

మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకే వచ్చా: పెద్దిరెడ్డి

టీడీపీలో 35 ఏళ్లు పనిచేశానని, అప్పటి నుంచి బీజేపీతో సత్సబంధాలున్నాయని మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి తెలిపారు. మూడేళ్లపాటు బీజేపీలో పనిచేశానని, హుజూరా బాద్ నుంచి పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నట్లు వెల్లడించారు. బీజేపీలోకి తిరిగిరావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దేశం కోసం ధర్మం కోసం నిత్యశ్రామికుడిగా పనిచేస్తున్న ప్రధాని మోదీ తిరిగి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో పార్టీలోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌లో క్షోభతో  కొట్టుమిట్టాడాను: వెంకటేశ్

భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్న నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పనిచేసేందుకు బీజేపీలో చేరినట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తెలిపారు. మోదీ మూడో సారి అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత అగౌరవం, అశాంతి, మానసిక క్షోభతో కొట్టుమిట్టాడానని తెలిపారు. ఆ సమయంలో బీజేపీలో చేరే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.