1 September, 2026 | 1:51 AM

రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలి: సీఎస్

01-09-2026 12:56 AM

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు  వికాస్‌రాజ్, నవీన్‌మిట్టల్ తదితర ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ, వివిధ శాఖల నుంచి అవసరమైన పరిపాలనా అనుమతులు, రైల్వే ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయ సహకారాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రైల్వే కనెక్టివిటీ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలన్నారు.