1 September, 2026 | 2:22 AM

కాటేస్తున్న విష జ్వరాలు!

01-09-2026 01:39 AM
  1. మంచం పడుతున్న పల్లెలు, పట్టణాలు 
  2. రాష్ట్రంలో కోరలు చాస్తున్న సీజనల్ వ్యాధులు
  3. దవాఖానలకు పోటెత్తుతున్న బాధితులు

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పుల కారణంగా విష జ్వరాలు కోరలు చాస్తున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇల్లూ జ్వరాలతో మంచంపడుతున్నది. నగరాల్లోని బస్తీ దవాఖానల నుంచి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల వరకు ఎక్కడ చూ సినా బాధితుల ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, తీవ్ర మైన ఇన్‌ఫ్లుఎంజా (వైరల్ ఫ్లూ), టైఫాయిడ్ కేసులు రోజురోజు కూ ప్రమాదకరంగా పెరుగుతున్నాయి.

క్షేత్రస్థాయిలో సరైన వైద్య సదుపాయాలు, వేగ వంతమైన రక్త పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో జనం ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జ్వరాల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. నారాయణగూడలోని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్‌కు రోజువారీ ఓపీ సంఖ్య రికార్డు స్థాయికి చేరింది.

కేవలం ఆగస్టు నెలలోనే ఈ ఆసుపత్రిలో సుమారు 20,400కు పైగా ఓపీ కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 700 మందికి పైగా రోగులు జ్వర పీడితులై ఇక్కడికి వస్తున్నారు. ఇన్‌పేషెంట్ అడ్మిషన్ల సంఖ్య కూడా క్రితం నెలతో పోలిస్తే రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతున్నది.

పల్లెల్లో జ్వర వణుకు..

కేవలం నగరాలే కాదు.. నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నది. జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో ఇటీవలే విషజ్వరాలతో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం గ్రామీణ ప్రాంతాల్లో భ యాందోళనలను పెంచింది. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రక్తం పరీక్షించే యంత్రాలు ఉన్నప్పటికీ, వాటిని నడిపే టెక్నీషియన్లు లేకపోవడంతో అవి మూలన పడ్డాయి. ఫలితం గా డెంగ్యూ నిర్ధారణ పరీక్షల కోసం పేద ప్రజలు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తున్నది.

లక్షణాలు ఇవే.. వైద్యుల హెచ్చరిక

ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరల్ జ్వరాల్లో బాధితులు తీవ్రమైన చలి, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, విపరీతమైన నీరసం, వాంతులు, కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వరం రాగానే మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రాణాంతకమని కామినేని వంటి ప్రముఖ ఆసుపత్రుల సీనియర్ ఫిజీషియన్లు హెచ్చరిస్తున్నారు.

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు 3 నుంచి 7 రోజుల వ్యవధి అత్యంత కీలకమని, ప్లేట్లెట్స్ పడిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఉండగా రాష్ట్రంలో వైరల్ జ్వరాల వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ జారీచేస్తున్న నివేదికలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మెజారిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ వసతులు లేకపోవడం వల్ల వేలాది మైల్డ్, మోడరేట్ కేసులు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడం లేదు. దీంతో ప్రభుత్వం చూపుతున్న గణాంకాల కంటే వాస్తవంగా జ్వర పీడితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వైద్య వర్గాలే అంగీకరిస్తున్నాయి.

అప్రమత్తమైన సర్కార్.. ‘ఫ్రైడే -డ్రై డే’ పాటించాలి

జ్వరాల ఉధృతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచినట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇళ్ల వద్దే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే - డ్రై డే’ పాటించాలని, ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు ఆరోగ్య సలహా జారీచేశారు.

గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్‌తోపాటు జిల్లా ఏరియా ఆసుపత్రులలో పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు పడకలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, బస్తీ దవాఖానల్లో పారాసిటమాల్ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ నిర్ధారణ పరీక్షల కోసం అవసరమైన రీఏజెంట్లు, డయాగ్నస్టిక్ కిట్లను ల్యాబ్‌లకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రు లు, వైద్య కళాశాలల్లో తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తున్నది. గత రెండేళ్లలో దాదా పు 10,000 మంది నర్సింగ్ ఆఫీసర్లను, ఇటీవల 2,322 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సర్జన్లను నియమించినప్పటికీ.. పెరి గిన ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీ ల రద్దీకి అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో జ్వరాల సీజన్‌లో రోగులకు వై ద్యం అందక నరకం కనిపిస్తున్నది. ప్రప ంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి 1,000 మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి.

కానీ ప్రస్తుతం రాష్ట్రం లో 1,000 మందికి కేవలం 1.58 మంది నర్సులు మాత్రమే అందుబాటులో ఉ న్నారు. అంటే డబ్ల్యూహెచ్‌వో ప్రమాణా ల కంటే 47 శాతం తక్కువ సిబ్బందితో రాష్ట్ర వైద్య రంగం నడుస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సుమారు 6 వేల నుంచి 7 వేల మంది నర్సింగ్ సిబ్బంది కొరత ఉన్నట్టు స్పష్టమవుతున్నది. రాష్ట్ర జనా భా ప్రకారం మొత్తం 1.16 లక్షల మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 60,919 మందే ఉన్నారు.