6 July, 2026 | 5:12 PM

భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

06-07-2026 04:39 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మిషన్ భగీరథ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌కు మెమోరాండం అందజేశారు.

ఆసిఫాబాద్ సెగ్మెంట్‌లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఎల్‌అండ్‌టీ, ఎవరెస్ట్‌తో పాటు ఇతర ఏజెన్సీలను పలుమార్లు సంప్రదించినప్పటికీ వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యం, కాలయాపన కొనసాగుతోందని ఆరోపించారు. జీతాలు అందక కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే భగీరథ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన జీతం ఇవ్వాలని, 26 రోజుల పని – 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను భగీరథ కార్మికులకు వర్తింపజేయాలని, ఎక్స్‌గ్రేషియా, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వడం, 20 శాతం బోనస్ లేదా ఒక నెల జీతం చెల్లించడం, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించడం, వారాంతపు సెలవులు మరియు జాతీయ పండుగల సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు చాపిడి బాలేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌కే జంషద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే షకీర్ తదితరులు పాల్గొన్నారు.