అస్సాం వరదల్లో 27 మంది మృతి
అస్సాం, జూన్ 22 : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అస్సాంలో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆకస్మిక వరదలతో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతా లు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వరదల కారణంగా జరిగిన నష్టంతో దాదాపు 4 లక్షల మంది ప్రభావితమయ్యారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ శనివారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, ఈ ఏడాది అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 27కి చేరింది. దాదాపు 1,71,000 మంది ప్రజలు తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. 15,160 మంది తాత్కాలిక సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. విపత్తు నిర్వహణ అధికారుల ప్రకారం, రాష్ట్రంలోని మూడు ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహించాయి. దీంతో 19 జిల్లాల్లో వరదలు సంభవించాయి. తద్వారా 2.40 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.






