21 March, 2026 | 5:15 AM

పల్లెల్లో గ్యాస్ కొరత

21-03-2026 12:20 AM

గ్యాస్ సిలిండర్ల  కోసం ప్రజల ఎదురుచూపులు

ఇండ్ల ముందు రోడ్లపై కనిపిస్తున్న ఖాళీ సిలిడర్లు

గ్యాస్ లేక హోటళ్లు మూత

బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న గ్యాస్ సిలిండర్లు

తనిఖీలు చేపట్టని సంబంధిత అధికారులు

కొరత లేదని చెబుతున్న అధికారులు..

సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు

కూసుమంచి, మార్చి 20, (విజయక్రాంతి): ఒకరి పెళ్లికి..మరోకరికి చావుకొచ్చిన చందంగా తయారైంది నేటి ప్రజల పరిస్థితి.. ఎక్కడో లక్షల మైళ్ల దూరంలో యుద్దం జరుగుతుంటే.. మనకు తలనొప్పిగా మారింది.. అక్కడ బాంబుల వర్షం..మనకు భయాందోళనకు దారి తీస్తుంది.. కారణం గ్యాస్ కొరత.. ఈ సమస్య పల్లె నుంచి పట్టణ ప్రజల వరకు అందరి సమస్యగా మారింది.. ఏ ఊళ్లో చూసిన.. ఏ వీధిలో చూసిన గ్యాస్ గురించే చర్చ.. ఏ ఇంటి ముందు చూసిన ఖాళీ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి..

సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో ప్రజలు పాత కాలం పద్దతిని పాటించే పరిస్థితి ఏర్పడుతుంది.. కట్టెలపోయే దిక్కైయ్యే పరిస్థితి కనిపిస్తోంది.. ఈ విషయం రోజురోజుకు జఠలమవుతున్నప్పటికి ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాధికారులు ప్రకటనలకే పరిమతమవుతున్నారు.. గ్యాస్ సమస్యపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.

 ఇరాన్-ఇజ్రాయిల్ యుద్దం పుణ్యమా అని తెలంగాణ ప్రజలకు గ్యాస్ కష్టాలు వెంటబడుతున్నాయి.. ఎప్పుడు కనివిని ఎరుగని, ఎవరు ఊహించని విధంగా నేడు గ్యాస్ కష్టాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.. గత కొద్ది రోజుల వరకు పట్టణాలకే పరిమితమైన గ్యాస్ కొరత.. ప్రస్తుతం పల్లెటూర్లకు, తండాలకు, మారుమూల పల్లెలలకు పాకింది.. గ్రామాల్లో సిలిండర్ల కొరత కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది.. సిలిండర్ల కోసం ప్రజలు షాపులకు పరుగులు తీస్తున్నారు.. గ్యాస్ కంపెనీలకు పోన్ల ద్వారా బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు..

అయినప్పటికి ఆన్ లైన్ లో బుకింగ్ కావడంలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది.. దీంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. సిలిండర్ బుకింగ్ చేసుకునేందుకు మిస్సుడు కాల్ ద్వారా, ఎస్‌ఎంఎస్ ద్వారా, పోన్ కాల్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఈ మూడు మార్గాల్లో కూడా పోన్ ఆవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, బిజీ టోన్ గా వినిపిస్తున్నాయి.. ఎస్‌ఎంఎస్ కూడా సెండ్ కావడం లేదు. దీంతో గ్యాస్ ఇన్ టైమ్‌లో గ్యాస్ అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు 

వాణిజ్య సిలిండర్ల గ్యాస్ కొరత కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.. గత కొద్ది రోజులుగా వ్యాపార సంస్థలకు గ్యాస్ కొరత అరకొరగా ఉండగా, అది ప్రస్తుతం అధికమైంది. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, వైరా, మణుగూరు, మధిర, సత్తుపల్లి, భద్రాచలం లాంటి పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్ కొరత కారణంగా చాలా షాపులు, హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లు మెను మార్చుకున్నారు. కొన్ని హోటళ్లలో కట్టెల పోయి ద్వారా వంటలు వండే పరిస్థితి ఏర్పడింది.

అలాగే వ్యాపార సంస్థలు, మెకానిక్ షాపులు, వాహనాల షోరూమ్ లు, గ్యాస్ లతో నడిచే ప్రతి ఒక్క వ్యాపార షాపుల యజమానులు గ్యాస్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరత ఇలాగే ఉంటే అతి కొద్ది రోజుల్లోనే దుకాణాలన్ని మూతపడే అవకాశం ఉంది. పెద్దపెద్ద హోటళ్లు, లాడ్జీలు దాదాపుగా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికే చాలా హోటళ్ల వద్ద ప్లెక్సిలు ఏర్పా టు చేసినట్లు తెలుస్తోంది.. 

పల్లెలకు పాకిన గ్యాస్ కోరత

యుద్దం ప్రభావంతో గ్యాస్ కొరత పల్లెలకు పాకింది.. గ్రామాల్లో, తండాల్లో, మారుమూల పల్లెల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. గతంలో ఒక్క రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటిముందుకు వచ్చి డెలివరి చేసి వెళ్లే వారు. ఎప్పుడు కూడా గ్యాస్ సమస్య వచ్కానీ ఇప్పుడు ఐదారు రోజులైనప్పటికి సిలిండర్లు రావడం లేదని, రోజుల తరబడి ఇంటిముందు సిలిండర్లు ఉంచిన ఫలితం లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ లేకపోతే వంట వండటం చాలా కష్టతరమవుతుందని ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కొరుతున్నారు. 

బ్లాక్ మార్కెట్ కు గ్యాస్ సిలిండర్లు..? 

యుద్దం నేపథ్యంలో రోజురోజుకు గ్యాస్ కొరత మరింత పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సప్లే చేసే డీలర్లు ఆధాయ మార్గాలను పెంచుకుంటన్నట్లు ప్రచారం జరుగుతోంది.. వంట గ్యాస్, గ్రుహాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గ్రామాల్లో, పట్టణాల్లో గ్యాస్ సిలిండర్లను ప్రజలకు ఇవ్వకుండా వ్యాపారులకు విక్రయాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో రోడ్ల పక్కనే ఉన్న వివిధ రకాల దుకాణాలకు సిలిండర్లను సరఫరా చేస్తూ అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిలిండర్లను అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది..

ప్రస్తుతం రూ.950 ధరకు ప్రజలకు సిలిండర్ ను సరఫరా చేయాల్సి ఉంటుంది.. కానీ గ్రామాల్లో, తండాల్లో ఒక్కోక్క సిలిండర్ కు రూ.1200 చొప్పున విక్రయాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. కావాలనే డీలర్లు గ్రామాల్లో ఉన్న వ్యాపారులకు సిలిండర్లను అధికధరలకు విక్రయించి, ఆ సిలిండర్లను మరింత ధరకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు గ్రామాల్లో తనిఖీలు చేయడం లేదని, అసలు పట్టించుకునే వారే కరువైయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు ఉపయోగపడే గ్యాస్ దళారులకు, వ్యాపారులకు వెళ్లకుండా ప్రభుత్వాధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇదంత జరగకుండా నేరుగా ప్రజలకు సిలిండర్లు చేరాలంటే అధికారులు గ్రామాల్లో, తండాల్లో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్యాస్ కొరత సమస్య పరిష్కరించేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరీ అధికారులు గ్యాస్ కొరత లేకుండా ప్రజలకు ఇన్ టైమ్ లో గ్యాస్ ను అందిస్తారా..? వేచి చూడాల్సిందే..?

చిరువ్యాపారులకు కష్టంగా మారిన గ్యాస్ కొరత

పట్టణ ప్రాంతాల్లో, మేజర్ గ్రామాల్లో మండల కేంద్రాల్లో చిరువ్యాపారులు గ్యాస్ పై ఎక్కువ ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తోపుడుబండ్లపై ఇడ్లి,దోసలు, మిర్చిలు, గారేలు అమ్ముకునే చిరు వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నచిన్న హోట్లలో కమర్షయల్ గ్యాస్ సిలిండర్లతోనే వ్యాపారం చేసుకుంటారు. అయితే యుద్దం ప్రభావంతో గ్యాస్ కొరత రావడంతో ప్రభుత్వం కమర్షయల్ సిలిండర్లను చాలా వరకు తగ్గించేసింది.

దీంతో చిరు వ్యాపారులకు గ్యాస్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తోపుడు బండ్లపై చిరు హోటళ్లు నడిపే చిరు వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత మరింత పెరిగితే తోపుడు బండ్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. ప్రతి రోజు బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటేనే వారి కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. ప్రతి రోజు చిట్టిలు, గిరిగిరి, ఈఎంఐ ల రూపంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది..