పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం..
అభయ మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పేరూరు ఎస్సై..
వాజేడు (విజయక్రాంతి): పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని వాజేడు మండల(Vajedu Mandal) పరిధిలో గల పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణ ప్రసాద్(SI Krishna Prasad) అన్నారు. ఈ మేరకు గురువారం పేరూరు రైతు వేదికలో ఏర్పాటుచేసిన అభయ మిత్ర కార్యక్రమంలో పాల్గొని చట్టాల గురించి ప్రజలు పాటించవలసిన విధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేరూరు, ధర్మవరం, ఐవారి పేట, కృష్ణాపురం, టేకులగూడెం, చండ్రుపట్ల గ్రామాలలోని ప్రజలకు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఒక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించరాదని, చట్టరీత్యా నేరస్థలవుతారని తెలియజేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని , లేనియెడల జూన్ 20 నుండి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబడుతుందని హెల్మెట్ లేని వాహనాలను సీజ్ చేయబడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు, యువకులకు, మహిళలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, నకిలీ విత్తనాల విక్రయం, పోక్సో చట్టం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాంపురం గ్రామ యూత్ టీంకు వాలీబాల్ కిట్టు అందించారు.






