ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మహారాజ్ పేట్ సర్పంచ్ వడ్ల సుజాత నరసింహ చారి
శంకర్ పల్లి,(విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మహారాజ్ పేట్ సర్పంచ్ వడ్ల సుజాత నరసింహ చారి పేర్కొన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాకాలం ఉన్నందున ఎన్నో రకాల రోగాలు వ్యాపిస్తాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజు కాచి చల్లార్చిన నీరును సరిగా త్రాగాలని సూచించారు. కాగా పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రి వారు గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల కోసం ఎన్నో సేవలు అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్, వార్డు సభ్యులు హరి ముదిరాజ్, కడకంచి లక్ష్మణ్, తూర్పాటి కలమ శ్రీనివాస్, విజయలక్ష్మి , ఆసుపత్రి డాక్టర్లు, విద్య సిబ్బంది తదితరు పాల్గొన్నారు.






