30 July, 2026 | 2:03 AM

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

30-07-2026 01:32 AM

జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, జూలై 29 (విజయక్రాంతి): భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.వర్షాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు అని ప్రజలకు సూచించారు. వరద నీటిని దాటే ప్రయత్నం చేయడం ప్రమాదకరం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, మెరుపులు పడే అవకాశం ఉన్న సమయంలో సేఫ్టీ గా ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని (కంట్రోల్ రూమ్) 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశామని, అవసరమైన సహాయక చర్యలకు అన్ని శాఖలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

వరదలు, భారీ వర్షాల వల్ల ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగ ఉంచినట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి‘ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రజలు అత్యవసర సంప్రదింపు నంబర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా నియంత్రణ కేంద్రం: 8468220069, పోలీస్ కంట్రోల్ రూమ్: 100, అగ్నిమాపక శాఖ: 101 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.