ఎమ్మెల్యే 7వ హామీ కోసం ప్రజల ఎదురుచూపులు
ప్రభుత్వ భూమి బోర్డు పీకేసి దర్జాగా కబ్జా..
పట్టించుకోని అధికారులు.
తాండూరు, మార్చి 8, (విజయ క్రాంతి): ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీ ఇస్తే ... నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరగకుండా ఏడవ గ్యారెంటీ హామీ నేను ఇస్తున్నానని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తాండూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే సర్వే నంబర్ 111 ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుంది.
కొందరు అప్రమార్కులు ఈ భూమిపై కన్నేసి అధికార పార్టీకి చెందిన కొందరు బడా నాయకులతో చేతులు కలిపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం విజయ విద్యాలయ పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ లొంక పాండు, పూర్వ విద్యార్థులు అడ్డుకొని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేశారు. విచారణ చేసిన కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమేనని ఇతరులు ఎవరు కూడా భూమిలోకి ప్రవేశించరాదని బోర్డు ఏర్పాటు చేశారు.
కాగా కొందరు భూ బకాసురులు మాత్రం బోర్డును పీకేసి ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు. అంతేకాదు మున్సిపల్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు సైతం చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంతో భూకబ్జాదారులు బరితెగిస్తున్నారు.
వీవీహెచ్‌ఎస్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ లొంక పాండు ఏమంటున్నారంటే..
111 సర్వేనెంబర్ ముమ్మాటికి ప్రభుత్వ భూమి. అందులో 14 ఎకరాల14 గుంటల భూమి ఉండగా మినీ స్టేడియం, స్మశాన వాటిక ,ధోబి ఘాట్ ఏర్పాటు అయ్యిందని. అయితే గత 50 సంవత్సరాల క్రితం వీధి నాటకాలు వేసుకునేందుకుగాను వేదికను ఏర్పాటు చేసుకునేందుకు ప్రసారం బసప్ప అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం చించోలి తాసిల్దార్ కు దరఖాస్తు చేసుకున గా వేదిక నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారని అన్నారు.
అక్కడే ఓ షెడ్ ఏర్పాటు చేసి వి వి హెచ్ ఎస్ ప్రైవేటు పాఠశాల ప్రారంభించారని తెలిపారు. రికార్డుల్లో ఎక్కడ కూడా భూ యజమాని పేరు లేదని అన్నారు. కోర్టులో కేసు ఉండగా ప్రభుత్వ భూమి ఎలా కబ్జా చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు బడా నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తప్పుదోవ పట్టించి ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అది ముమ్మాటికి ప్రభుత్వ భూమి. . వి వి హెచ్ ఎస్ పూర్వ విద్యార్థి శ్యాంబాబు. .
నేను ప్రాథమిక విద్య వివిహెచ్‌ఎస్ లో కొనసాగించాను. విద్య సంస్థతో గాని భూమితో గాని ప్రసారం కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.. వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ పాఠశాలలో విద్యను అభ్యసించలేదు. వారిది పేరున్న మంచి కుటుంబం. . వారి పేరును ఇందులో ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు ఎవరు అవునన్నా.. కాదన్నా ఆ భూమి ముమ్మాటికి ప్రభుత్వానిదే. ఇది ఇలా ఉండగా అవినీతి అక్రమాలు జరగకుండా నియోజకవర్గ ప్రజలకు ఏడవ గ్యారంటీగా ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అమలు చేస్తారని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.




