20 May, 2026 | 12:41 AM

ఆ ప్రాజెక్టులు ఇక స్పీడ్!

24-08-2024 02:35 AM
  1. 19 ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షణ
  2. ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం
  3. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ నుంచి...
  4. యాంటీ డ్రగ్ స్ట్రాటజీ వరకు ఇందులోనే
  5. ప్రతిరోజూ ఆన్‌లైన్ పోర్టల్‌లో పనుల అప్‌డేట్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రగతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తానే స్వయంగా సమీక్షిస్తూ వాటిని వేగంగా పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులను నేరుగా తానే పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘స్పీడ్’ అనే సరికొత్త కార్యాచరణ అమలుకు నిర్ణయం తీసుకున్నారు.

‘స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ’ (ఎస్‌పీఈఈడీ పేరుతో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మిషన్‌ను రూపొందించిన సీఎం.. ఇందులో 19 ప్రాజెక్టులను చేర్చారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం పూర్తిచేయటానికి తీసుకొనే చొరవే ఈ స్పీడ్. ఇందులోని 19 ప్రాజెక్టుల పనులను సీఎం స్వయంగా నెలకోసారి సమీక్షిస్తారు. సమస్యల పరిష్కారం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య తలెత్తే అడ్డంకులు, అవరోధాలను అధిగమించేందుకు స్పీడ్ కార్యాచరణ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. 

ఆలస్యం జరక్కుండా నేరుగా సీఎం స్థాయిలోనే నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. నిర్దేశించిన సమయంలోగా ఎంత పని జరుగుతుందనే అంశాలను ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటికప్పుడు ఏయే పనులు పూర్తవుతాయనే అంచనాలను కూడా ఇందులో చేర్చుతారు. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఈ రోజు ఎంతమేర పని జరిగిందనే సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ను ఇందులో పొందుపరుస్తారు.

స్పీడ్‌లోని ప్రాజెక్టులు

1. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్

2. శాటిలైట్ టౌన్ల అభివృద్ధి

3. మెట్రో రైలు విస్తరణ

4. జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ

5. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)

6. హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు

7. కొత్త విమానాశ్రయాలు

8. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం

9. మహిళా శక్తి పథకం అమలు

10. జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం

11. రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు

12. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సంస్థాగత అభివృద్ధి

13. ఐటీఐలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు

14. కొత్త ఉస్మానియా ఆసుపత్రి

15. కొత్తగా 15 నర్సింగ్, 

28 పారా మెడికల్ కాలేజీలు

16. హెల్త్ టూరిజం ప్రమోషన్

17. ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్

18. టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం

19. యాంటీ డ్రగ్ స్ట్రాటజీ అమలు