07-09-2025 12:45:02 AM
తెలంగాణ సర్వకళాసంపన్నమైంది. తెలంగాణకే ప్రత్యేకమైన కళలు, ఉత్సవాలు, పాటలు ఉన్నాయి. ఇందులో నృత్యంలో తెలంగాణకే ప్రత్యేకతను సంతరించే నాట్యకళ పేరిణి నాట్యం. వీరత్వానికి ప్రతీకగా నిలిచే పేరిణి లాంటి నృత్యం ప్రపంచంలో మరెక్కడా లేదు.
భారతీయనృత్యకళకే అలంకారమైంది పేరణి. ‘శివతాండవాల్లో కనిపించని అపూర్వనాట్యం.. శివశక్తిని ప్రేరేపించి, ఆ శక్తికి శరీరాన్ని సాధనంగా చేసిన నాట్యకారుడు చేసే నర్తనం ఇది. ఇది ఉధృత కళారీతి. దీనికి వాయిద్యమే వేరు. ఆవేశపూరితమైన ‘శుద్ధ’ తాండవం.. దీనిలోని లయవేగం మరో నర్తనంలో కనిపించదు. మనదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఇంత వేగమైన నృత్త సంప్రదాయం లేదు. వీరావేశపూరితమైన ఈ నాట్యంలో ‘విలంబిత లయ’ ఉండదు. త్రికాలాల్లో విజృంభించే నర్తనమిది’ అని నటరాజ రామకృష్ణ గారి అభిప్రాయం.
మైలారభటులు, మైలారు వీరులు, పశుతులు, మహేశులనే శైవ సాంప్రదాయకులు ఈ వీరనాట్యాన్ని ప్రదర్శించేవారు. రణరంగానికి వెళ్లే వీరుల్లో రుద్రప్రేరణ చేసేందుకు నాట్యమాడేవారు. శైవారాధనలో ప్రాణార్పణను మోక్షంగా భావించేవారు. సాయుధులై వీరనాట్యం చేసేటపుడు మైలారుభటులు దేహాలు, శిరస్సులు ఖండితమైనా నాట్యం ఆపేవారు కాదు. వీరుల్లో అసాధారణమైన ఆవేశాలను పురిగొల్పడానికే ఈ పేరిణి వీరనాట్యం అవతరించింది.
ఈ నాట్యానికి వాద్యమే ప్రధానం, గీతం కాదు. ఇది అంగహార నర్తనం. ఇది శివకేళికా విలాసం. అంగ, ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా నవరసాలను సృష్టించాలి. ఈ అంగహార నర్తనం అసాధారణం. దీనికి వాయిద్యాలను మోగించడం కష్టం. మహామద్దెలపైన మార్దంగికుడు నవరసాలను పలికించాలి. తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు, జాతులను మద్దెలపై మోగించాలి.
పేరిణినాట్యం పురాతనమైనది. మొదట నృత్తం ఒకటే. తరవాతికాలంలో వచ్చిన భేదాలు నృత్తంలో మార్గ, దేశీ రూపాలు. ఆ దేశీభేదమే ప్రేరణం, ప్రేరణి, పేరణి, పేరిణిలుగా నాట్యశాస్త్రాల్లో, కావ్యాల్లో పేర్కొన్నది పేరిణినాట్యం. జయపసేనాసి (గణపతిదేవుడి బావమరిది) నాట్యశాస్త్రాన్ని రాసిన మొదటి తెలుగువాడు. ఆయన రాసిన ‘నృత్తరత్నావళి’లో ఈ నాట్యభేదం దేశీరూపాల్లో ఒకటిగా పేరొందింది. జాయన వర్ణించిన దేశిభేదాలు రెండువర్గాలు. మొదటిది దేశిస్థానక, ఉత్లుతీకరణ, భ్రమరి, పాద, పాట, చారి, రాస్యాంగ, గతిభేదాలు. రెండవదిః పేరణి, రాసకం, చర్చరి, బహురూపం, భాండిక, కొల్లాటం.
జాయప ‘ప్రణవ స్వరూపుడైన శివుని స్తోత్రం చేస్తూ వాద్యమేళాల వారు పాడితే సృష్టి క్రమాన్ని తెలియజేసే ఆంగికం నృత్త, నృత్యాలతో విరాజిల్లుతుంది. ప్రణయ స్వరూపుడైన ఆ దేవదేవుడి కీర్తిస్తూ పాడితే సృష్టి క్రమాన్ని తెలియజేసే ఆ నర్తనం కరణ, చారీ, ఆంగహారాల సంపుటీకరణంతో సమ్మిళితమై ఉంటుంది. ప్రళయమూర్తిగా ఆ ఆదిదేవుడి స్తుతిస్తూ పాడితే రుద్రమూర్తి తిరోగమనంతో చివరికి అనుగ్రహమూర్తి వికాసంతో ఆ నృత్య, నృత్తాలు ముగుస్తాయి. ఇంతటి వికాసవంతమైన నర్తనమాడటానికి ఈ శృంగంలో అవకాశముంది. ఆ నర్తనంలో నర్తకుడు తన నృత్యకళా పాండిత్యాన్ని, ప్రతిభను ప్రదర్శించొచ్చు. కేవలం భక్త్యావేశాలనే కాక నర్తకుడు అపూర్వ తాళ, ఛందస్సుల్లో తన నాట్యవిద్యను ఈ నర్తనంలో ప్రదర్శించవచ్చు. అనేక విధాలైన అనుకరణ నర్తనాలను దీనిలో ప్రదర్శించవచ్చు. చివరకు మహానర్తనాన్ని ప్రదర్శించడంతో ప్రేరణ నర్తనం ముగుస్తోందని ప్రేరణ నర్తనాక్రమాన్ని వివరించాడు.
కౌశలం గలవాడు, నాట్యవేత్త, నానావిధాలైన ఆలవులు నేర్చినవాడు పేరణి అవుతాడంటారు జాయన. పేరిణి నాట్యకారుడు గవ్వలు, బంగారు, రత్నాల నగలు ధరించి, విభూతి పూసుకొని, తనతో 4, 6 లేదా 8గురు విడిగానో, గుంపుగానో నాట్యం చేయాలి. ఈ పేరిణికి నృత్తం, కైవారం, ఘర్ఘరం, వికటం, గీతం అని (జాయన మతం), ఘర్ఘరం, విషమం, భావాశ్రయం, కవివారకం, గీతం అని(నటరాజ రామకృష్ణ మతం) 5 అంగాలు.
తిక్కన భారతంలో విరాటపర్వంలో విరాటరాజుకు తానెంత నాట్యవేత్తనో అని బృహన్నలరూపంలో ఉన్న అర్జునుడు చెప్పుకొనేటపుడు (విరాటపర్వం -ప్ర.అ.239 పద్యంలో) ‘ప్రేరణియును’ అని ప్రస్తావిస్తాడు. అది తిక్కన కాకతీయుల కొలువులో ఉన్నప్పుడు చూసిన నృత్యరీతే అయుంటుంది. నాచన సోమనాథుడు తన ఉత్తర హరివంశంలో పేర్కొన్న దేశీ నృత్యరీతుల్లో ఒకటి పేరిణి (ఉ.హ.వం.-4-216 పద్యం). శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలోని 1-118 పద్యంలో ‘ప్రేరణి, ప్రేంఖణ, సింధు, కందుక, ధమాళి, చేల, మతల్లీ, హల్లీసకా’ది నృత్యంబులంటారు. రఘునాథ నాయకుడు వాల్మీకిచరిత్రలో (3-42) ‘పేరణి దండలాస్యమును’ అని పేర్కొంటాడు.
కాకతీయుల కాలంలో పాశుపత సంప్రదాయ శైవమతాచారం ప్రకారం 6సార్లు దైవారాధన చేసేవారని.. ఆల యాల్లో మూలవిరాట్టుకెదురుగా గుండ్రంగాఉండే బలిపీఠంమీద దేవదాసీ నృత్యపూజ జరిగేదని నటరామకృష్ణ తన ‘దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర’ అనే గ్రంథంలో రాశారు. వీరులను యుద్ధాలకు పురిగొలిపేటందుకు చేసే ఆహవతాండవ నృత్యమే పేరిణి అని, దీన్ని పురుషులే చేయాలని అంటారు. కానీ, చెంగల్వ కాళకవి ‘రాజగోపాలవిలాసం’లో వర్ణించిన ‘ముద్దు చంద్రరేఖ’ పేరణి నృత్య కారిణిగా కీర్తిపొందింది. విజయరాఘవ నాయకుడు కూ డా ఆమెను పేరణి కళాకారిణిగా కీర్తించాడు. అందువల్ల పేరిణి నాట్యం స్త్రీలకు నిషేధమే కాదని చరిత్రే చెబుతోంది.
‘పేరిణి తాండవం ఒక విశిష్ట కళారూపం. తెలుగువీరులు రుద్రప్రేరణగా ప్రదర్శించి, లోకానికి అందించిన వీరనాట్యం. ఇలాంటి వీరనాట్యం ప్రపంచంలో వేరేచోట లేదని నేను గట్టిగా చెప్పగలను. దీన్ని ఎలాగైనా పునఃసృష్టించాలన్న సంకల్పం నాకు కలిగింది. ఈ సంకల్పం వల్లే ఓర్పుతో శ్రమించాను. కాలగర్భంలో కలిసిపోయిన, సుమారు వేయ్యేండ్లుగా మరుగున పడిన ఈ శివతాండవాన్ని పునఃసృష్టించాను. ఈ పేరిణి తాండవాన్ని పునఃసృష్టించడానికి నాకు పది సంవత్సరాలు పట్టింది. ఈ శివతాండవం గురించి కాళహస్తిలో మా గురువు రాజమ్మ చెప్పగా నేను మొదటిసారి విన్నాను. శైవారాధనా గ్రంథాల్లో ఉన్న శివప్రేరణ విధానాలను ఆకళింపు చేసుకున్నా. శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి, కలశ అనే ఈ ఏడూ ప్రత్యేకమైన శివుడి తాండవాలు. ఇవి విశిష్టమైన తాండవాలని గ్రహించి పేరిణి శివతాండవాన్ని రూపొందిం చాలని నిశ్చయించుకొన్నా. నృత్త రత్నావళి దీనికి ప్రధానమైన ఆధార గ్రంథం’ అన్నాడు నటరాజ రామకృష్ణ.
రామప్ప శిల్పాల్లో నృత్యభంగిమలను ఉపాసించి పేరిణికి ప్రాణం పోసిన నటరాజ రామకృష్ణ గారే రామప్ప దేవాలయ అంతరాల జాలకం మీదు ఉన్న మృదంగ వాద్యవిన్యాసాలు ఆధారంగా పేరిణినాట్యాన్ని సృష్టించి, పెంచి, పోషించారు. ఎందరికో నేర్పించారు. పేరిణితాండవ ప్రదర్శనం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చుకున్న వ్యక్తి రామకృష్ణ. 1985లో తన కోర్కె తీరింది. శివరాత్రి పండుగ రోజు పొద్దున మొదలు లింగోద్భవకాలం వరకు శైవాగమ సంప్రదాయ ప్రకారం ఆరువేళల్లో ఆరురకాల నాట్యాలను చేయించాడు. అదేరాత్రి పదివేల దీపాలతో రామప్ప గుడిని అలంకరించి, 4 లక్షల మంది ప్రజల ముందు నూరుమంది కళాకారులతో పేరిణి నాట్యాన్ని ప్రదర్శన చేయించారు. ఏడు వందల యాభై యేండ్ల తర్వాత మళ్లీ పేరిణి నాట్యం చూసే అవకాశం కలిగింది.