calender_icon.png 8 September, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్కెలు తీర్చే బుగ్గ రాజన్న!

07-09-2025 12:43:37 AM

కీకారణ్యంలో శైవ క్షేత్రం 

ఇది ఒక అద్భుతమైన శైవక్షేత్రం. కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడి నిలయం. తెలంగాణలో రెండవ వేములవాడగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. భక్తజనుల హృదయాల్లో కొలువై ఉన్న శ్రీ బుగ్గ రాజన్న ఆలయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని దట్టమైన కన్నాల కీకారణ్యంలో ఈ పురాతన శైవ క్షేత్రం ఉన్నది. నిత్యం భక్తజనుల నీరాజనాలందుకుంటున్నది. స్వయంభుగా వెలసిన పురాతన మహిమాన్వితమైన శివలింగంపై నిత్యం జలధార ప్రవహిస్తూంటుంది. తెలంగాణలోనే ఇటువంటి అద్భుతమైన సన్నివేశం మరే శైవ క్షేత్రంలోనూ కనిపించదు. బుగ్గ గర్భగుడిలో దర్శనమిచ్చే ఈ అద్భుత మహిమను కన్నుల నిండా వీక్షించాలన్న కోరికతో భక్తులు ఇక్కడికి కుటుంబాలతో సహా తరలివస్తారు. 

కీకారణ్యంలో ఉన్న ఈ బుగ్గ రాజన్న ఆలయాన్ని గతంలో మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేవారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామం నుంచి నాలుగు కిలో మీటర్ల పొడవున ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో శివుడు వెలిశాడు. అయితే అటవీ జంతువుల భయంతో భక్తులు శివరాత్రి ఉత్సవాలకే పరిమితమయ్యేవారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతుండటంతో ఇప్పుడు ప్రతిరోజు వందల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

బుగ్గ దేవాలయం ప్రత్యేకతలు 

తెలంగాణ ప్రాంతంలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి శైవక్షేత్రాన్ని రెండవ వేములవాడగా భక్తులు కొలుస్తున్నారు. కాకతీయుల కాలంనాటి ఈ శైవ క్షేత్రం స్వయంభుగా బుగ్గ ప్రాంతంలో వెలసిందని ప్రచారంలో ఉంది. కాకతీయ రాజులు ఈ శైవ క్షేత్రాన్ని తరచూ సందర్శిస్తూ అభివృద్ధిపరిచారని చరిత్ర చెపుతున్నది. అత్యంత మహిమలతో కూడిన ఈ శివాలయాన్ని దర్శించి ఇక్కడ కొద్దిసేపు సేద తీరితే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందన్న భావన భక్తజనుల హృదయాల్లో నిండుకున్నది. పురాతనమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ శివాలయంలోని గర్భగుడిలో వెలసిన శివలింగంపై త్రిభువనధారిణి అయిన గంగ నిత్యం అభిషేకిస్తూ దైవలీలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నది. నిత్యం బ్రహ్మ ముహూర్తంలో నాగిని దేవతార్చనలు జరుగుతాయని పూర్వకాలం నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. 

రకాల వంటకాలు, నైవేద్యాలతో మొక్కులు 

రాజరాజేశ్వరుడిని మదినిండా తలిస్తే ఇట్టే కోరికలు తీరుస్తాడన్న ప్రగాఢ విశ్వాసాన్ని నింపుకొని భక్తులు వివిధ రకాల వంటకాలు, నైవేద్యాలతో ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఏటా మహాశివరాత్రికి మూడు రోజుల పాటు జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బెల్లంపల్లి మండలంలోని ఏడు మండలాల ప్రజలే కాకుండా మంచిర్యాల, చెన్నూరు, కొమురం భీం ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాలతో పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ ప్రాంతాల నుంచి కూడా ఈ శైవ క్షేత్రంని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. 

బుగ్గకు ఇలా చేరుకోవచ్చు

శివ లీలలతో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ శైవ క్షేత్రానికి సమీపంలో ఉన్న బుగ్గ గూడెం, కరిసెల ఘట్టం, వరిపేట గ్రామాల ప్రజలు కాలిడకన, ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లపై వస్తుంటారు. బెల్లంపల్లి నుంచి వచ్చే భక్తులు ప్రైవేటు వాహనాల్లో లక్ష్మీపూర్, కన్నాల గ్రామాల నుంచి అటవీ మార్గం గుండా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి పది నిమిషాల్లో చేరుకోవచ్చు.  

మైమరపించే అందాలెన్నో

రాజరాజేశ్వరుడు కొలువుదీరిన బుగ్గ అటవీ ప్రాంతంలో మైమరపించే అందాలెన్నో దర్శనమిస్తాయి. ఇక్కడి ప్రకృతి రమణీయతను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఇష్టపడతారు. దట్టమైన కీకారణ్యంలో మూడు వైపులా ఎత్తున కొండల నడుమ కింది భాగంలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయం కొలువై ఉంటుంది. ఆలయం పక్కనే కుడి వైపున భక్తాంజనేయ దేవాలయం ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఆలయం కింది భాగంలో భక్తులు పుణ్యస్నాల ఆచరించేందుకు వీలుగా నీటితో నిండి ఉన్న మహిమగల కోనేరు సాక్షాత్కరిస్తుంది. గుట్ట వెనుక వైపు నాగులమ్మ ఆలయం భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రతీనిత్యం దేవాలయానికి వచ్చే మహిళలు నాగులమ్మకు ప్రత్యేకంగా పూజలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. నాగులమ్మకు మొక్కు తీరిస్తే యువతీ, యువకులకు వివాహాలు, కొత్తగా పెళ్లయిన జంటలకు సంతానం, మహిళలకు సౌభాగ్యం, నాగసర్ప దోషాలు తొలగిపోతాయన్నది భక్తుల్లో విశ్వాసం. దేవాలయం ముందు భాగంలో ఎత్తున గద్దెపై పురాతనమైన రాతి నందీశ్వరుడు, శివలింగం, వినాయకుడి విగ్రహాలు ఎంతో ముచ్చట గొలుపుతూ ఆకట్టుకుంటాయి. ఎత్తయిన ఏటవాలు కొండలపై నుంచి కిందనున్న శివాలయానికి చేరుకుంటుంటే భక్తులకు ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుంది.

మంచి పిక్నిక్ స్పాట్ 

బుగ్గ అటవీ ప్రాంతానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా కూడా గుర్తింపు ఉంది. ఆది వారాలు, సెలవు దినాల్లో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతంలో పిక్నిక్‌కు వస్తారు. ఇక్కడి చెట్ల కింద వంటలు వండుకొని వనభోజనాలు చేస్తారు. బుగ్గకు అతి సమీపంలోనే బుగ్గ గూడెం ప్రాజెక్టు ఉండటంతో ఈ ప్రాజెక్టు ప్రాంతం నీటితో, పచ్చని అడవి, గుట్టలతో చూడముచ్చటగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో షార్ట్‌ఫిల్మ్స్ తీయడానికి కళాకారులు ఉత్సా హం చూపుతారు. ఆకుల శివప్రసాద్, బెల్లంపల్లి

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం

బుగ్గ దేవాలయం పవిత్రమైనది. అత్యంత మహిమగలది. ఇక్కడికి నమ్మకంతో భక్తులు వస్తారు. పండుగలు, ప్రత్యేక మాసాలలో బుగ్గ ప్రాంతం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి ఉదయం ధూప దీప నైవేద్యం అందేలా చూస్తున్నాం. దాతల సహకారంతో దేవాలయం వద్ద రెండు పూట బావులు తవ్వించి నీటి సౌకర్యం కల్పించాం. భక్తులు సేదదీరెందుకు విశాలమైన కళ్యాణ మండపాన్ని నిర్మించాం. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతీ సోమవారం దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.

 మాసాడి శ్రీదేవి శ్రీ రాములు, చైర్మన్

అఘోరా కోసం శివుడు ప్రత్యక్షం 

దేవతా సంభూతుడైన అఘోరా ఒకరు బుగ్గ ప్రాంతంలో శివారాధన చేస్తూ ప్రతి మహాశివరాత్రికి కాశీకి వెళ్లి వచ్చేవాడని, వృద్ధాప్యంలో కాశీకి వెళ్లలేక బాధపడుతూ శివున్ని ఆరాధిందించగా నిద్రలో అతడికి శివుడు ప్రత్యక్షమై “నేను ఈ బుగ్గ ప్రాంతంలో వెలిశాను. నన్ను సేవించడం కోసం త్రిభువనధారిణి అయిన గంగమ్మ ఇక్కడ వెలసిన మూడు కొండల మధ్య నుండి ఎడతెగకుండా నన్ను సేవిస్తుంటుంది” అని చెప్పి అదృశ్యమయ్యాడనే పురాణం ప్రచారంలో ఉన్నది. నాటి నుంచి నేటి వరకు బుగ్గ గర్భగుడిలోని శివలింగంపై నిత్య జలధార ప్రవహిస్తూ భక్తుల మదిని దోచుకుంటుంది.