21-01-2026 05:43:56 PM
జిల్లా కలెక్టర్ కే.హరితకు ప్రజాసంఘాల వినతి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ కే.హరితను ప్రజాసంఘాల నాయకులు (DYFI, KVPS, TAGS) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రధాన సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాల లోపంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
డిగ్రీ, పీజీ, సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేయాలని, పూర్తయిన బీసీ పోస్ట్ మెట్రిక్ కళాశాలను ప్రారంభించాలని కోరారు. డైట్ కళాశాల పరిశుభ్రం చేసి అడ్మిషన్లు ప్రారంభించాలన్నారు. ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్‌లో అదనపు గదులు నిర్మించడంతో పాటు ఎస్సీ, బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు, టెక్నీషియన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
గుండి, అప్పపెల్లి, తుంపెల్లి, కనర్‌గాం, అనార్పల్లి వాగులపై వంతెనలు, కిరిడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, జనకాపూర్ క్రీడామైదానానికి సదుపాయాలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, కార్యదర్శి గొడిసెల కార్తీక్, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు కొరింగ మాల శ్రీ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.