21-01-2026 05:46:33 PM
- మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్
కరీంనగర్ క్రైం,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రౌడీషీటర్ గా ప్రవర్తిస్తున్నారని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూషించడంతోపాటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా గద్దెలను కూల్చివేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తా అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై తీసుకోవాలని త్వరలో డీజీపీ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి ఈ విధంగా బాధ్యతా రహితంగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమన్నారు. సీఎం వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉండటంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మీర్ షౌకత్ ఆలి, ఆరే రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, శాతవాహన యూనివర్సిటీ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు చుక్క శ్రీనివాస్, అధ్యక్షులు బొంకూరి మోహన్, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, దినేష్ , అన్వేష్, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు .