28 April, 2026 | 1:40 PM

Breaking News

ఏ రైతును కలవని కేసీఆర్‌కు.. ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరు?   •   పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు   •   మహబూబాబాద్‌లో దారుణం.. కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య   •   గూగుల్‌ రాక ఏపీకి గేమ్‌ ఛేంజర్‌   •   విశాఖపట్నం ఇక నుంచి AI పట్నం.. దక్షిణాదిపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు   •   ప్రజల ఆశీస్సులతో మళ్ళీ పునః జన్మ దక్కింది   •   క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై నిరసన.. ఆటోను తాడుతో లాగిన సీఐటీయూ నాయకులు   •   పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన   •   ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. యువకులతో పోటీపడి గోల్స్..!   •  

తీవ్రమవుతున్న పెట్రోల్, డీజిల్ కొరత

26-04-2026 02:12 PM

నో స్టాక్ బోర్డులతో వెనుదిరుగుతున్న వాహనదారులు

దమ్మపేట,(విజయక్రాంతి): మండలంలో పెట్రోలు, డీజిల్ లకు తీవ్ర కొరత ఏర్పడింది. దమ్మపేట, మందలపల్లి, గండుగులపల్లిలో హెచ్పీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటి అన్నంటిలో నో స్టాక్ బోర్డు లు దర్శనమివ్వడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సామాన్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత కొన్ని రోజులుగా సరఫరా క్రమంగా తగ్గడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకుల్లో స్టాక్ అయిపోవడంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులను మూసివేస్తున్నాయి. బంకుల మూసివేతతో దమ్మపేట పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలకు డీజిల్ దొరక్కపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 దమ్మపేట బంక్ లపై ఏపీ సరిహద్దు ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో అక్కడి వాహనదారులు తెలంగాణ సరిహద్దుల్లోని బంకులకు క్యూ కడుతున్నారు. దీనివల్ల స్థానిక బంకుల్లో ఉన్న నిల్వలు కూడా వేగంగా అడుగంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం డీలర్లకు సరఫరా అందడం లేదని తెలుస్తోంది. అడ్వాన్స్ నగదు చెల్లించినా ఇండెంట్ క్యాన్సిల్ అవ్వడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని డీలర్లు పేర్కొంటున్నారు.

వదంతులను నమ్మవద్దని అధికారులు కోరుతున్నప్పటికీ, బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసినా ఇంధనం లభించకపోవడంతో జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. పెట్రోలు, డీజిల్ కొరత నిజంగానే ఉన్నదా, లేదా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్మపేట మండలంలో పెట్రోల్ బంక్ ల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెట్రోలు బంకుల్లో ప్రజావసరాలకు సరిపడా నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.