17 July, 2026 | 11:41 AM

ఫోన్‌ట్యాపింగ్‌ను తీవ్రంగా పరిగణించాలి

05-06-2024 01:20 AM

ఇది వ్యక్తిగత గోప్యతలోకి చొరబడటమే

హైకోర్టు సీరియస్.. కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు

హైదరాబాద్ జూన్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాపింగ్ చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ఇది వ్యక్తిగత గోప్యతలోకి చొరబాటేనని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఎస్బీఐ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు సుమోటో కేసుగా తీసుకున్న విషయం విదితమే. 

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. చేపట్టి కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం అదనపు డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తోందని తెలిపారు.

ఈ దశలో సీనియర్ న్యాయవా ది, మాజీ అడ్వొకేట్ జనరల్ కే రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, టెలిగ్రాఫ్ చట్టం కేంద్రం పరిధిలోనిదని చెప్పారు. పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏర్పాటైన కమిటీ దృష్టికి ఈ అంశం వెళ్లాల్సి ఉందన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి సూచనలు అవసరంలేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తరువాత కోర్టుకు సహకరించవచ్చని పేర్కొంది. సుమోటో తీసుకున్న అంశంపై ఒకే రోజులో ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది.