ఇమ్లీబన్‌లో ఫూలే జయంతి వేడుకలా?
- బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లోనే నిర్వహించాలి
ఆర్టీసీ యాజమాన్యం అధిక నిధులు కేటాయించాలి
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సామాజిక సంఘసంస్కర్త, బీసీల ఆరాధ్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఆర్టీసీ యాజమాన్యం తూతుమంత్రంగా నిర్వహించాలని చూస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆర్టీసీలో 70 శాతం ఉన్న బీసీ కార్మిక, ఉద్యోగుల డిమాండ్ ను ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని బీసీ జేఏసీ కార్యాలయంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్. తిరుపతి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాక్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ప్రతియేటా ఆర్టీసీ కళ భవన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
అయితే అంబేద్కర్ తన గురువు అని చెప్పుకునే జ్యోతి రావు పూలే జయంతి మాత్రం ఇమ్లీబన్ బస్ స్టేషన్‌లో నిరాడంబరంగా చేస్తున్నారని విమర్శించారు. జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభు త్వం కేవలం 20 వేలు నిధులు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఇమ్లీబన్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం సరైంది కాదని, ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నెల11న జరిగే జ్యోతిరావు పూలే జయంతికి లక్షల రూపాయలు నిధులు కేటాయించి, బాగ్లింగం పల్లిలోని ఆర్టీసీ కళ భవన్ లోనే ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ సంఘం నేతలు నందగోపాల్, సత్యరాజ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కే. వెంకటేష్ గౌడ్, సంఘం ప్రతినిధులు బి. మల్లయ్య గౌడ్, ఉపేందర్, రాజు, గడ్డం యాదగిరి, మహేష్ యాదవ్, కోల రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




