5 April, 2026 | 4:09 AM

రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే..

05-04-2026 12:18 AM
  1. బీహార్ గ్యాంగ్‌ను తలపించేలా కాంగ్రెస్ తీరు
  2. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా? 
  3. క్యాంపు ఆఫీస్‌పై దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలి
  4. మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ప్రతిపక్ష నేత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే దాడి చేశారని, ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ, సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడు లు చేస్తుంటే రాష్ట్రం లో శాంతిభద్రతలు ఉన్న ట్టా? లేన ట్టా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులపై, ప్ర జాసంఘాలపై, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని విమర్శించారు.

శాంతిభద్రతలను కా పాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అని నిలదీశారు. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ గూండా రాజ్యం అమలుచేస్తారా? సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేసారా? అని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్‌ఎస్ అదరదు, బెదరదని, ప్రజాక్షేత్రంలో మిమ్మ ల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్‌చేశారు. దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.