రోడ్డు పక్కనే చెత్త గుట్టలు
- పందుల స్వైర విహారం
- ప్రజారోగ్యానికి ముప్పుగా అక్రమ చెత్త డంపింగ్
జవహర్‌నగర్, జూలై 16 (విజయక్రాంతి): జవహర్నగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఆనుకుని అక్రమంగా చెత్త, నిర్మాణ వ్యర్థాలను పడేయడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది. రోడ్డుపక్కనే పేరుకుపోయిన చెత్త గుట్టల్లో పందులు స్త్వ్రరంగా సంచరిస్తూ ఆహారం కోసం వెదుకుతున్న దృశ్యాలు స్థానికులను కలవర పెడుతున్నాయి. చెత్త నుంచి వ్యాపిస్తున్న దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతిరోజూ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గంలో చెత్త గుట్టలు పెరుగుతుండటంతో రహదారి అందవిహీనంగా మారింది. నిర్మాణ శిథిలాలు, ప్లాస్టిక్ సంచులు, గృహ వ్యర్థాలు, ఇతర చెత్తను విచక్షణారహితంగా పడేయడం వల్ల ఈ ప్రాంతం అనధికార డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. చెత్తపై పందులు, వీధి కుక్కలు సంచరించడం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చెత్తలో నిల్వ నీరు చేరి దోమలు, ఈగలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు, ఇతర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రోడ్డుపైకి పందులు అకస్మాత్తుగా రావడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
స్థానికుల పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెత్తను పడేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో అక్రమ డంపింగ్ రోజురోజుకూ పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. అక్రమంగా చెత్త వేస్తున్న వారిపై భారీ జరిమానాలు విధించి, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, రోడ్డుపక్కన పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పరిశుభ్రతను కాపాడాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.






