కుదిరిన సీట్ల పంపకం.. 7 సీట్లు ఎక్కువ దక్కించుకున్న బీజేపీ
చెన్నై: తమిళనాడులో ఎన్డీఏ కూటమి(National Democratic Alliance) పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు ఏఐడీఎంకే అంగీకారం తెలిపింది. గత ఎన్నికల కంటే బీజేపీ ఏడు సీట్లు ఎక్కువగా దక్కించుకుంది. ఒప్పందంపై పీయూస్ గోయెల్, పళనిస్వామి సంతకాలు చేశారు. పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. చెన్నైలో పీయూష్ గోయల్, నైనార్ నాగేంద్రన్, అన్బుమణి రామదాస్ (PMK), టీటీవీ దినకరన్ (AMMK) సహా పలువురు ఎన్డీయే నాయకుల సమక్షంలో విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపకాల చర్చలు ఈ రోజే ముగుస్తాయని, తుది నిర్ణయం తీసుకున్న అనంతరం ఈ రాత్రికి వాటిని ప్రకటిస్తామని AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి తెలిపారు.
ఎన్నికల అనంతరం ఏఐఏడీఎంకే(AIADMK) స్పష్టమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పళనిస్వామి పేర్కొన్నారు. తాను న్యూఢిల్లీకి జరిపిన పర్యటనల విషయంలో, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి(Chief Minister of Tamil Nadu) ఎం.కె. స్టాలిన్ వ్యాప్తి చేస్తున్న అపవాదులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాన్ని ఈ రాత్రిలోగా ఖరారు చేయగలమని ఆశిస్తున్నట్లు ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియను ఆ తర్వాత ఉమ్మడిగా చేపడతామని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... "మేమందరం ఒకే కుటుంబంలా ఉన్నాము, విజయం సాధించడమే లక్ష్యంగా మేము ఎన్నికల్లో పోరాడుతాము. మాకు కేటాయించిన 27 స్థానాల పట్ల మేము ఎంతో సంతృప్తిగా ఉన్నాము. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ల తీరుతో విసిగిపోయి ఉన్నారు కాబట్టి, మేము ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తాము. వారు రాష్ట్ర సంస్కృతిని దెబ్బతీశారు. ఈ రాష్ట్రంలో ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది." అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.




