ప్లాస్టిక్ రహిత గ్రామం..టీ.. ప్లాస్టిక్ కప్పులోనా.?
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ(Gram Panchayat) వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం రాఘవపూర్ రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ ఎంపీడీఓ గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని వార్డు సభ్యులకు సూచించారు. అదే సమయంలో శిక్షణకు వచ్చిన వారికి ప్లాస్టిక్ కప్పుల్లో టీ అందించడంతో పెద్దలింగారెడ్డిపల్లి వార్డు సభ్యుడు కోదాది శ్రీనివాస్ లేచి, “ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని చెబుతూ.. ఇక్కడ ప్లాస్టిక్ కప్పుల్లో టీ ఎలా ఇస్తున్నారు?” అని ప్రశ్నించారు.
ముందుగా అధికారులు ఆచరించి, తర్వాత ప్రజలకు సూచనలు చేయాలని ఆయన హితవు పలికారు. దీంతో వెంటనే స్పందించిన ఎంపీడీఓ మధుసూదన్ ప్లాస్టిక్ కప్పులను తొలగించి గాజు గ్లాసుల్లో టీ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన శిక్షణ కార్యక్రమంలో చర్చనీయాంశంగా మారింది.