కాంగ్రెస్‌లో చేరడంపై పోచారం ఎమన్నారంటే..?
హైదరాబాద్: మాజీ స్వీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని మాత్రమే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేస్తామని పోచారం పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు తనకు బాగా నచ్చాయని చెప్పారు. పనిచేసే నాయకత్వాన్ని సమర్థించేందుకే రేవంత్ కు మద్దతిస్తున్నవాని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
నేడు పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం పోచారం ఎంతో కృషి చేశారని రేవంత్ కోనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.






