5 May, 2026 | 7:51 PM

ప్రయోగాలకు ఆద్యుడు పాల్కురికి!

27-05-2024 12:05 AM

ఉరుతర గద్య పద్యోక్తుల కంటె

సరసమై బరగిన జానుదెనుగు

చర్చింపగా సర్వసామాన్యమగుట

గూర్చెద ద్విపదలు గోర్కి దైవార..

అంటూ తెలుగువారికి తొలిసారి ద్విపదలను పరిచయం చేసిన ప్రతిభాశాలియైన కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగు సాహిత్యంలోని అనేక విషయాల్లో తొలి అడుగులు వేసిన తెలుగు కవి పాల్కురికి. 

తెలుగులో తొలి దేశి పురాణం, తొలి శతకం, తొలి ఉదాహరణ కావ్యం, తొలి చారిత్రక కావ్యం, తొలి రగడ కావ్యం వంటి విశేష ప్రక్రియా పద్ధతులను తెలుగు లోగిలిలోకి తెచ్చిన మహనీయుడు ఆయన. అన్నిటా తనదైన ప్రత్యేక ముద్రతో, తన ప్రతిభా పాండిత్యాలతో అబ్బుర పరచే రీతిలో రచనలు చేసిన సోమన కవీంద్రుని గురించి ఎందరెందరో తెలుగు సాహిత్య చరిత్రకారులు తమ రచనల్లో పలు విశేషాలను వ్యక్తంచేశారు.

మన ‘పాలకుర్తి’ కవీంద్రుడు

దాదాపుగా తెలుగు సాహితీ ప్రముఖులు, తెలుగు సాహిత్య చరిత్రకారులు తెలిపిన వివరాలను అనుసరించి, ఆయన శ్రియాదేవి విష్ణురామిదేవుడు దంపతుల కుమారుడు. వీరశైవ మతానుయాయి. శ్రీ గురులింగనార్యుని వద్ద శివదీక్ష తీసుకొని, కట్టకూరి పోతన దేవరవద్ద శిక్షాభ్యాసం చేశాడు. కరస్థలం విశ్వనాథయ్య ద్వారా కవితా రహస్యాలను తెలుసు కున్నాడనీ తెలుస్తున్నది. ఆయన నివాసం విషయంలో పలు భిన్నాభిప్రాయాలు వున్నాయి. సోమన తెలుగులోనేగాక కన్నడ భాషలో సైతం కృతులు వెలయించినాడు. కన్నడ దేశప్రాంతపువాడైన బసవేశ్వరుని చరిత్ర వాటిలో ఒకటి. ఈ నేపథ్యం లోనే చిలుకూరి నారాయణరావు వంటి పెద్దలు ఈ కవి కన్నడ దేశంలోని ‘హాలకుర్తి’కి చెందిన వానిగా భావించారు. కాని, తదనంతర పరిశోధకులు అనేక విధాలుగా శోధించి సోమనాథుని జన్మస్థలం ఒకప్పటి వరంగల్లు జిల్లా, ఇప్పటి జనగామ జిల్లాకు చెందిన ‘పాలకుర్తి’ గ్రామమే అని నిర్ధారించారు. విశేష పరిశోధన చేసి అనేక ప్రమాణాలతో ఈ నిర్ధారణ చెయ్యడం ఒక చారిత్రక సత్యావిష్కరణకు మూలమైనట్లుగా భావించాలి.

అది ‘రెండవ ప్రతాపరుద్రుని’ కాలమే

పాల్కురికి సోమనాథుని గురించి విశేష పరిశోధనలు చేసిన పండితులైన వేటూరి ప్రభాకరశాస్త్రి, బండారు తమ్మయ్య, సాహిత్య చరిత్రకారులైన కందుకూరి వీరేశలింగం, చాగంటి శేషయ్య, ఆరుద్ర, ఆచార్య ఎస్.వి.రామారావు, డా॥ ముదిగం టి సుజాతారెడ్డి, డా॥సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి పెద్దలు చర్చోపచర్చలు చేసి సోమన కాలాన్ని 1190 గా స్థిరపరిచారు. కొందరు సోమనాథుడు మొదటి ప్రతాపరుద్రుని కాలం వాడని భావించినా, తదుపరి పరిశోధకులు రెండవ ప్రతాపరుద్రుని కాలం వానిగా పేర్కొన్నారు. చారిత్రక కావ్యాలైన ‘ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రము’, కాసె సిద్ధప్ప రచన యైన ‘సిద్ధేశ్వర చరిత్రము’ల ఆధారంగా ఈ కవి రెండో ప్రతాపరుద్రుని కాలం వానిగానే అభిప్రాయపడ్డారు. కీ.శే. వే.న.రెడ్డి (వేణుముద్దల నరసింహారెడ్డి) ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పాల్కురికి సోమనాథుని గురించి పరిశోధించారు. ఆయన తమ పరిశోధనా గ్రంథంలో సోమన జన్మస్థలం, కాలం గురించి విపులంగా చర్చించారు. పూర్వ పరిశోధకుల నిర్ణయాల్లోని సత్యాసత్యాలపైనా తర్కించిన తర్వాతే వివరాలను నిర్ణయించారు. ఇది ఒక గొప్ప ప్రామాణికతను సంతరించుకున్న సమాచారంగా భావించాలి.

శతక లక్షణాలకు శ్రీకారం

పాల్కురికి సోమనాథుని రచనలన్నీ భావి కవులకు మార్గదర్శకాలుగా నిలిచి పోయాయి. ఏ సన్ముహూర్తంలో శతక రచనకు శ్రీకారం చుట్టి ‘బసవా! బసవా! బసవా! వృషాధిపా!’ అనే మకుటంతో ‘వృషాధిప శతక’ రచన చేశారోగాని నేటికీ ఆ ప్రక్రియ వివిధ విషయాలతో సుసంపన్నమై అలరారుతున్నది. సోమన భక్తి శతకంతో ప్రారంభించినా కాలక్రమంలో నీతి శతకాలు, సామాజిక భావ శతకాలు మొదలుగా విషయ వైవిధ్యం కలిగి, లక్షల సంఖ్యలో శతక శాఖ విస్తరించింది. శతక లక్షణాలంటే ఇవీ అని నిర్ణయించడానికి పాల్కురికి శతకమే ఆధారమైంది. ఆయన వృత్త పద్యాల్లో శతకం రచిస్తే తదనంతర కవులు కందం, ఆటవెలది, సీసం మొదలైన పలు వృత్తాలతో శతకాలు రచించారు. కేవలం కొందరు ఎటువంటి మహాకావ్యాలు రాయకున్నా శతక రచన మాత్రమే చేసి మహాకవులుగా కీర్తింపబడ్డారు. శతకం ఆధునిక భావాలను కూడా ఘనంగా ప్రసారం చేయగలిగిన గొప్ప ప్రక్రియగా సాహిత్య ప్రపంచంలో స్థిరపడింది. ఈ రకంగా పాల్కురికి సోమన కీర్తి పతాకగా శతకం రెపరెపలాడుతున్నది.

బసవేశ్వరునిపై ‘తొలి దేశి పురాణం’

తన పూర్వులైన కవులు మహాభారత, రామాయణాది పురాణేతిహాసాలలోని వస్తువులను గ్రహించి రచనలు చేశారు. సోమన ఆ మార్గాన్ని వదలి తన కాలానికి కొంచెం ముందటి కాలం వాడైన బసవేశ్వరుని జీవితాన్ని వస్తువుగా గ్రహించి ‘బసవ పురాణాన్ని’ రచించాడు. ఫలితంగా గొప్ప ప్రయోగశీ లియైన కవిగా కీర్తిని పొందాడు. మార్గ ఛందస్సులో అద్భుతంగా రచన చేయగల శక్తికలిగి ఉన్నా తన రచనలో ‘ద్విపద’ను గ్రహించి తన గ్రంథాన్ని ‘తొలి దేశి పురాణం’గా నిలిపాడు. ఈ కావ్యం శివపారమ్యాన్ని, శివభక్తులలోని శివభక్తిని తెలిపే గొప్ప రచన. ఇందులో మహారాజులో, పురాణ పురుషులో, వాళ్ల గొప్పదనాలో, వాళ్ల జీవితాలో వర్ణింపబడలేదు. అతి సామాన్యులైన మడివాలు మాచయ్య, బెజ్జ మహాదేవి, సంగవ్వ, గొడ గూచి, సిరియాళుడు మొదలైన వారి కథలు, వాళ్లలోని శివభక్తిని మాత్రమే ఆయన వర్ణించాడు. సామాన్యులకు కూడా అక్షర ప్రపంచంలో అపురూపమైన వేదిక నిచ్చిన కవిగా ఘనకీర్తిని గడించాడు.

వీర శైవం పాల్కురికి వారి మతం. వీర శైవ మత ప్రచారకు లు, గురువులపై అమిత భక్తి తత్పరతను కలిగిన వాడు. కనుకనే, శ్రీపతి పండితారాధ్యుల వారి చరిత్రను ‘పండితారాధ్య చర్రిత’ పేరున ఒక ప్రత్యేక చారిత్రక కావ్యమే సృష్టించాడు. తత్ఫలితంగా ‘తొలి చారిత్రక కావ్యకర్త’గానూ సాహితీ జగత్తులో నిలిచిపోయాడు. ఇది కూడా ద్విపద కావ్యంగానే రూపొందడం ‘ద్విపద’ ఛందంపై ఆయనకున్న అనురాగానికి నిదర్శనంగా చెప్పాలి.

సామాన్యులే  కథానాయకులు

కులాల అంతరాలు మానవుల మధ్య అగాధాలను సృష్టిస్తాయని నమ్మి, శివభక్తి అన్ని కులాల మతాలవారిని కలిపే ఏకసూత్రంగా భావించాడు సోమన. తాను స్వయంగా శైవ మతాన్ని అవలంబించి, అన్ని రచనలను శివపరంగానే రచించాడు. సామాన్యులను సైతం కావ్యంలోకి తీసుకు వచ్చి వారి కీర్తిని ఇనుమడింప చేసిన ఘనుడాయన. సోమనాథుని మొదటి రచన ‘అనుభవ సారము’లోని 243 పద్యాలలో దాదాపు 163 వరకు కంద పద్యాలే కావడం గమనార్హం. దేశి ఛందస్సుపై ఆయనకున్న అనురాగాన్ని దీనిద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ‘రగడ’ ఒక విశేషమైన దేశి ఛందో విభేదం. ఆ ‘రగడ’తో కావ్యాలే సృష్టించారు. ఇది ఆయనలోని ‘దేశి ఛందంపై వుండిన అవ్యాజమైన ప్రేమ’ను చాటుతున్నది. ప్రతీ నూతన ప్రయోగానికీ పాల్కురికి వారు ఆద్యుడిగా నిలిచి పోయారు. ఆయన రచనల్లో ఆ కావ్యాలు కూడా ప్రామాణికంగా పరిగణింపదగినవే.

శతక ప్రక్రియకు నాటినుండి నేటివరకు ఏ విధమైన ప్రాచు ర్యం వచ్చిందో పాల్కురికి వారి  ‘ఉదాహరణం’ ప్రక్రియకు కూడా అంతటి ప్రాచుర్యం పొందింది. సోమన్న తొలుత తెలుగులో, సంస్కృతంలోను ఈ ప్రక్రియలో చిరు కావ్యాలు రచించారు. ఈ సారస్వత ప్రక్రియ నేటివరకూ కొనసాగుతూనే ఉంది. ప్రథమ మొదలు సప్తమీ విభక్తి వరకు ఏడు విభక్తులలో, సంబోధన ప్రథమా విభక్తిలోను ఒక్కొక్క పద్యం, కళిక, ఉత్కళికల్లో ఒక్కొక్క పద్యం మొత్తం 24 పద్యాలు. అలాగే, ఒక సార్వ విభక్తికమైన పద్యం, కళిక, ఉత్కళిక మొత్తం 27 పద్యాలు. ఇలాంటి కావ్యాన్నే ‘ఉదాహరణ కావ్యం’ అంటారు. తమకు ఇష్టమైన దైవాన్ని స్తుతిస్తూ ఈ పద్యాలు వుంటాయి. కాలక్రమంలో ప్రముఖ వ్యక్తులు, దేశభక్తులను గురించి కూడా ఈ ‘ఉదాహరణ కావ్యాలు’ వెలువడ్డాయి. దీనికి మూల పురుషుడు పాల్కురికి సోమనాథుడు కావడమే విశేషం. భాష విషయంలో, వస్తువు విషయంలో, ఛందస్సు విషయంలో అడుగడుగునా కొత్తదనాన్ని నింపుకున్న కవి పాల్కురికి సోమనాథుడు, నిజంగా ‘తొలి అడుగుల తెలుగు కవి’గా కీర్తిని సాధించాడు.

ముప్పయి అద్భుత రచనలు

అప్రతిమాన ప్రతిభామూర్తియైన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘అనుభవసారం’, ‘బసవ పురాణం’, ‘వృషాధిప శతకం’, ‘బసవ రగడ’, ‘శ్రీబసవాఢ్య రగడ’, ‘గంగోత్పత్తి రగడ’, ‘సహస్ర గణమాలిక’, ‘చెన్నమల్లు సీసములు’, ‘చతుర్వేద సారము’, ‘పండితారాధ్య చరిత్రము’, ‘పండితారాధ్యోదాహరణము’, ‘బసవోదాహరణము’ అనే పన్నెండు కృతులు రచించాడు. కన్నడ భాషలో కూడా ‘అక్షరాంక పద్యగళు’, ‘శరణు బసవ రగడ’, ‘బసవ లింగనామావళి’, ‘సద్గురు రగడ’, ‘చెన్నబసవ రగడ’, ‘శివసహస్ర గణనామ’, ‘శీల సంపాదన’ పేర్న ఏడు కృతులు రచించాడు. సంస్కృత భాషా పాండితీ మండితుడైన సోమనాథుడు సంస్కృత భాషలోను ‘పంచ ప్రకార గద్య’, ‘సంస్కార గద్య’, ‘అక్షరాంక గద్య’, ‘బసవోదాహరణమ్’, ‘బసవ పంచరత్న’, ‘వృషభాష్టకమ్’, ‘బసవాష్టకమ్’, ‘త్రివిధ లింగాష్టకమ్’, ‘అష్టోత్తర శతనామగద్య’, ‘సోమనాథ భాష్యమ్’, ‘రుద్ర భాష్యమ్’ అనే పదకొండు రచనలు చేశాడు. ఈ 30 రచనలతో ఇన్ని ‘ఎక్కువ రచనలు చేసిన ప్రాచీన కవి’గా వినుతికెక్కాడు.

గన్నమరాజు గిరిజా మనోహర బాబు

వ్యాసకర్త సెల్: 9949013448