తెలంగాణకు వరం సురవరం
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమ కారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్ర, ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 మంది కవులతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ను కవుల జీవిత విశేషాలతోసహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం.
రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు 1896 మే 28న నేటి జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లి గ్రామంలో అమ్మమ్మ గారింట ప్రతాపరెడ్డి జన్మించా రు. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం వారి ది ఒక సుప్రసిద్ధ అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్లం వంటి బహుళ భాషలలో ఆయన నిష్ణాతులు. ‘గోల్కొండ’ పత్రిక, దానికి అనుబంధంగా ‘భారతి’ సాహిత్య పత్రిక, ‘ప్రజావాణి’ పత్రి కలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. నైజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్, ట్యాంక్ బండ్‌పై ప్రతిష్ఠితమైన విగ్రహాలలో సురవరం వారికి కూడా స్థానం లభించింది.
అలంకరణ లేని జాణ!
ప్రతాపరెడ్డి మద్రాసులో చదువుకునే రోజుల్లో స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్నది. మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, సత్యాగ్రహోద్యమాలు ప్రతా పరెడ్డిపై ప్రభావం చూపాయి. ఆయనలో దేశభక్తి అణువణువునా జీర్ణించుకుపోయింది. ఆనాడు నిజాం ఉక్కు పాదల కింద స్వేచ్ఛ కోల్పోయి ఉలుకు పలుకు లేకుండా అణగారి పోతున్న తెలంగాణలో నవ చైత న్యం తీసుకు రావడానికి నడుం బిగించారాయన. తన ఆర్థిక సంపదను, అక్షర సంపదను తెలంగాణ శ్రేయ స్సు కోసం ధారపోసారు. నాటి ప్రజా చైతన్య మహోద్యమంలో విభిన్న రంగాలలో కృషి సలిపారు. పరా యి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవడానికి ఆవిర్భవించింది ‘ఆంధ్ర మహాసభ’. 1930లో మెదక్‌జిల్లా జోగిపేటలో ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ’ తొలి సమావేశం జరగ్గా, ఈ చారిత్రక సభకు ప్రతాపరెడ్డియే అధ్యక్షత వహించారు. విజ్ఞానవర్ధిని పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యులైన ప్రతాపరెడ్డి తర్వాత అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. కులమతాల పట్టింపు లేని ఆయన యాదవ సంఘం, గౌడ సంఘం, ముదిరాజ్ సంఘాలకూ అధ్యక్షులుగా ఉన్నారు. ‘హైదరాబాద్ ఆయుర్వేద సంఘం’ అధ్యక్షుడుగా, ‘ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం సంఘం’ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్రా భాషా నిలయం, లక్ష్మణరాయ పరి శోధన మండలి, బాల సరస్వతి గ్రంథాలయం, వేమన గ్రంథాలయం వంటి సంస్థలతో అనుబంధం ఉండేది సురవరం వారికి. ఆనాటి తెలంగాణలోని సాహిత్య సంస్థలతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆయనకు సంబంధం ఉన్నది కూడా. అందుకే ‘ఆయన లేని తెలంగాణ అలంకరణ లేని జాణ’ అన్నారు దాశరథి.
సురవరానికి రాజకీయాలపట్ల ఆసక్తి లేకపోయినా సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డిపై విజయం సాధించడం ద్వారా ‘హైదరాబాదు శాసనసభ’కు ఎన్నికయ్యారు. కానీ, ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయక పోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు మంత్రి పదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం వారు స్వయంగా తనకు ఆప్తులైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ, ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు’ అని వ్యాఖ్యానించారు.
ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించారు సురవరం. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం వంటివి వున్నాయి. 1955లోనే ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచనకు ‘కేంద్ర సాహిత్య అకాడమి’ అవార్డు లభించింది. ‘హిందువుల పండుగలు’ గ్రంథానికి పీఠిక రాసే క్రమంలో నాటి భారత ఉపరాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్, ‘శ్రీయుత ప్రతాపరెడ్డి గారిచే విరచితమైన హిందువుల పండుగలు గ్రంథానికి పీఠిక వ్రాయుటకు నాకు శక్తి చాలదు’ అని అభి ప్రాయపడ్డారు. దీన్నిబట్టి ఆ పుస్తకం విశిష్టత అర్థమవుతున్నది. ఇవేగాక ‘హైందవ ధర్మవీరులు’, ‘వెంక ట్రామారెడ్డి జీవిత చరిత్ర’, ‘చంపకీ భ్రమర విషాదం’, ‘హరిశర్మోపాఖ్యానం’ వంటి పద్యకావ్యాలు,‘ఉచ్చల విషాదం’, ‘భక్త తుకారాం’ వంటి నాటకాలు, ‘ఆంధ్ర లిపి సంస్కరణము’ వంటి భాషాపరమైన గ్రంథం రాశారు. ఆడంబరాలు, బేషజాలు లేని నిరాడంబర జీవనంతో తన జీవిత సర్వస్వాన్ని సాహిత్య, ప్రజా సేవలకు అంకితం చేసిన ఉత్తమ వ్యక్తి, మానవతా వాది, తెలంగాణ గర్వించదగ్గ మహోన్నతమూర్తి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి. 1953 ఆగస్ట్ 25న తన స్వగృహంలో గుండెపోటుతో లోకాన్ని విడిచి వెళ్లారు.
-సుధాకర్.ఏ.వి
సెల్: 9000674747






