5 May, 2026 | 9:11 PM

మా ‘సారు’

27-05-2024 12:05 AM

నన్ను హైస్కూలు దాటిన తరువాత కూడా ఆయన ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇప్పటి దాకా ఆయనతో మాట్లాడటం, చర్చించటం (కనీసం రెండు గంటలు ఎప్పుడూ తగ్గదు) నాకు బలం ఇస్తుంది. ఆనంద కుమారస్వామి అన్నా, రాధాకృష్ణన్ అన్నా, ముల్క్‌రాజ్ ఆనంద్ అన్నా ఆయనకు ఇష్టం. ఆయన నిర్మలంగా జీవించారు. తాత్త్వికంగా ఆయన వామపక్ష వాదీ కాదు, దక్షిణ పక్షమూ కాదు. చాలాకాలం దాకా ఆయన ఆస్తికుడూ కాదూ, నాస్తికుడూ కాదు. ఒకానొక దశలో ఆయన సత్యసాయి భక్తుడు అయినారు.

పాఠశాలలోనే విద్యార్థులకు వికాసానికి సంబంధించిన బీజాలు పడుతాయి. తరువాతి వారి వ్యక్తిత్వంలో నాటి ముద్ర స్పష్టంగానే కనిపిస్తుంది. అధ్యాపకులు ఊహించిన మార్గం కాకపోవచ్చు. అప్పటి ప్రేరణ ఒక ఆంతరమైన జ్యోతియై బ్రతుకును సాగింప జేస్తుంది.

నాకు ఆంగ్లోపాధ్యాయులు దెందుకూరి సోమేశ్వరరావు. ఆయన పాఠం చెప్పటం ఏదో అలవోకగా చెప్పినట్లు ఉండేది. ఆంగ్లబోధ ఆయన మూర్తిమత్త్వంలో ఒక చిన్ని భాగం మాత్రమే. తొమ్మిది, పది తరగతులలో ఆయన వస్తే ఒక నూతన ప్రపంచం విచ్చుకునేది. భారతీయ సంస్కృతిని అనేక పార్శ్వాలతో ఆయన పరిచయం చేసేవారు. తాము స్వయంగా చిత్రకారులు. ఆనాళ్లలో పోతన చిత్రం, ప్రతాపరుద్రుని చిత్రం చిత్రించి సాహిత్యానికి, చరిత్రకు సంబంధించిన ఒక చైతన్యాన్ని మేల్కొలిపారు.

మమ్మల్ని విహారయాత్రలకు తీసుకు వెళ్లటం ఆయన బాధ్యత. ఆ విహార యాత్రలలో మన చరిత్ర, కళా వికాసం మనోదర్పణంలో ప్రతిఫలించేవి. రామప్ప దేవాలయం, పాకాల చెరువు, వేయి స్తంభాలగుడి, వరంగల్ కోట ఇవన్నీ ఆయన వెంట ఉండి చూచినవే. ఆయనతో ఈ పురాతన స్థలాలను దర్శించటం ఒక విచిత్రమైన ముద్ర వేసేది మనస్సుమీద. శాసనం చూపి దాని వివరాలు, తెలుగు లిపిలోని పరిణామం చెప్పినారు. కప్పుమీద ఉన్న శిల్పాలలోని పురాణ గాథలను వివరించటమే కాదు, వాటి శిల్పీకరణలోని విశిష్టతను వ్యాఖ్యానించేవారు.

రామప్ప దేవాలయంలో కోష్ఠ శిల్పాల ప్రత్యేకతను చెప్పి ఇతర స్థలాలతో పోల్చి విశదం చేసేవారు. అక్కడి ఆవరణలో నిలిచి ఉన్న స్త్రీ విగ్రహాల నిర్మాణంలో ఉన్న వైవిధ్యాన్ని పోలికలను చెప్పేవారు. రామప్పలోని నాగిని మొదలైన స్త్రీమూర్తులలో లావణ్య సౌకుమార్యాలు అంతగా లేవని, ఇంచుమించు ఆ కాలంలోనివే అయిన హోయసల శిల్పాలలో స్త్రీ లావణ్య సౌకుమార్యాలు పుష్కలంగా ఉండటం చెప్పి, కాకతీయుల నాటి సమాజంలో స్త్రీలు కూడా యుద్ధాలకు సంసిద్ధంగా ఉండటం ఇందుకు కారణం అని చెప్పినట్లు గుర్తు. అక్కడ ఒక క్షీర సాగర మథన శిల్పం ఉన్నది. ఆ శిల్పంలో చలన లక్షణం శిల్పి ఎలా నిక్షిప్తం చేసిందీ వివరించారు.

రామప్పలోని నాట్య భంగిమలు, సంగీత వాద్యాలు చూపి, ఆ మందిర నిర్మాత జాయప సేనాని ఎంతగా కళా నిపుణుడో, నృత్త వేదియో చెప్పి నృత్త రత్నావళిని గురించి చెప్పారు. నాటి కాలంలోని మత సంస్కృతులు ప్రజల జీవనాన్ని ఎలా ప్రభావితం చేసిందీ వివరించారు. వేయి స్తంభాల దేవాలయంలోని రుద్రదేవర, వాసుదేవర, సూర్యదేవరల త్రికూటాలయ వైశిష్ట్యాన్ని వివరించి, కేశవాలయం చుట్టూ కేశవాది చతుర్వింశతి మూర్తులు చెక్కబడిన అంశాన్నీ వివరించారు. ఈ మూడు ఆలయాల ద్వార బంధాలపైన ఉన్న రుద్ర, నరసింహ, సూర్యనారాయణుల తాండవ మూర్తులను గుర్తింపజేసేవారు. ఆ ఆలయం వైపు పోతూ ఉండగా ఒక చిన్న శిథిలాలయ ద్వారబంధం ఉపరితలాన త్రిమూర్తుల తాండవ శిల్పం ఉండటం నేను చాలాకాలం తరువాత చూచి అచ్చెరువు చెందాను.

ఇటీవల వేయి స్తంభాలగుడిలోని కల్యాణ మంటపాన్ని తొలగించారు మళ్ళీ నిర్మించేందుకు. దానిలో అంతగా ప్రముఖం కాని చోట ఒక విచిత్రమైన శిల్పం ఉన్నది. స్తంభ మధ్యంలో ఒకవైపు సన్యాసి జడలు పెరిగిన రూపంలో, మరొకవైపు ఒక సుందర భామిని. ఆమె చేతిలో పూల పండ్ల బుట్ట. దానిపైన ఒక చిలుక. వారిద్దరి పాదాల నడుమ ఒక కోతి. ఎంత అద్భుతమైన దృశ్యం. ఏదో, నాటి తపోభంగ గాథ ఇంత ప్రతీకాత్మకంగా చిత్రించటం వింతగానే తోస్తుంది పరిశీలించితే.

మా సోమేశ్వరరావు గారిని చూస్తే రాళ్ళు పలికేవనుకుంటా. నాటినుంచీ ఈనాటి వరకు ఎవరు ప్రముఖులు వచ్చినా ఈ శిల్ప క్షేత్ర సందర్శనం చేయాలంటే ఆయనే స్వయంనీత మార్గదర్శకులు.

స్వయంగా చిత్రకారుడు కావటం వలన చిత్రకళా వికాసాన్ని గురించి చెప్పేవారు. బెంగాలీ చిత్రకళా రీతికీ, బాంబే చిత్రకళా రీతికీ ఉన్న వైవిధ్యాన్ని వివరించారు. అవనీంద్రనాథ్, నందనాల్ బోస్ మొదలైన చిత్రకారులను పరిచయం చేశారు. నేను పికాసో పేరు విన్నది ఆయన ద్వారానే.

ఇంగ్లీషు బోధిస్తూనే భారతీయ పునరుజ్జీవనోద్యమం గురించి, దానిలో పాల్గొన్న మహనీయుల గురించీ తెలియజెప్పేవారు. ఈ సందర్భంలోనే రామకృష్ణ పరమహంస, వివేకానంద, దయానందులు, రమణులు, శ్రీ అరవిందులు మా పరిచయ పరిధులలోకి ప్రవేశించారు. పరమ సంపన్నమైన ఆధునిక భారతీయ తాత్త్విక చింతన స్థూలంగానైనా నా మనసుకు స్ఫురించింది.

ఆయనకు గ్రంథమంటే ప్రాణం. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, వీటిల్లో ఏ మంచి పుస్తకమైనా ఆయన గ్రంథాలయంలో చేరవలసిందే. అయిదారు పెద్ద బీరువాలలో వరుసగా అందంగా తీర్చిదిద్దిన ఆయన గ్రంథాలయం చూస్తే ఎంతో అబ్బురం. ఒక రకంగా స్వంత గ్రంథాలయం నా కోసం నేను ఏర్పరచుకోవటం ఆయన ప్రేరణే.

నన్ను హైస్కూలు దాటిన తరువాత కూడా ఆయన ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇప్పటి దాకా ఆయనతో మాట్లాడటం, చర్చించటం (కనీసం రెండు గంటలు ఎప్పుడూ తగ్గదు) నాకు బలం ఇస్తుంది.

ఆనంద కుమారస్వామి అన్నా, రాధాకృష్ణన్ అన్నా, ముల్క్‌రాజ్ ఆనంద్ అన్నా ఆయనకు ఇష్టం. ఆయన నిర్మలంగా జీవించారు. తాత్త్వికంగా ఆయన వామపక్ష వాదీ కాదు, దక్షిణ పక్షమూ కాదు. చాలాకాలం దాకా ఆయన ఆస్తికుడూ కాదూ, నాస్తికుడూ కాదు. ఒకానొక దశలో ఆయన సత్యసాయి భక్తుడు అయినారు.

కాకతీయ శిల్పం మీద ఆయన విమర్శగ్రంథం వ్రాశారు. ఆయన ఆనాళ్లలో మంచి ఫోటోగ్రాఫరు. కాకతీయ శిల్పాల చిత్రాలు సుమారు నాల్లైదు వందలు ఫోటోలలో సేకరించి పెట్టారు. వరంగల్లులో స్నాతకోత్తర కేంద్రం ప్రారంభం అయి తెలుగుశాఖ వెలసినప్పుడు 12 x 18 సైజులో వంద కాకతీయ శిల్పాల ఫోటోలను వారు ఆ శాఖకు బహూకరించారు. కాకతీయ విశ్వవిద్యాలయం అధికార చిహ్నమూ, దాని క్రింది సూక్తీ ఆయన చిత్రించినవే. అయితే, కొన్ని మలకలు తిరిగి అది మరొకరిది కూడా అయింది. ఆ కథ చెప్పటం చేదు జ్ఞాపకాలను త్రవ్వటమే.

మా ‘సారు’ ఇప్పటికీ ఉల్లాసంగా పుత్ర పౌత్ర పౌత్రికలతో ఆనందంగా ఉన్నారు. ఇటీవల మా పోతన విజ్ఞాన పీఠాని’కి వారు 1949లో చిత్రించిన పోతన చిత్రాన్ని బహూకరించారు. ఇప్పటికీ ఆయన అధ్యాపకులే, అధ్యయన శీలియే, భావుకులే, చరిత్రకు వ్యాఖ్యాతయే, యువతరానికి ప్రేరణ యిచ్చేవారే.

జ్ఞానపీఠ పురస్కారం వచ్చాక విశ్వనాథ వారికి వరంగల్లులో గొప్ప సన్మానం చేద్దామని ఆయన ప్రోత్సహించారు. నేనూ, ఆయనా కలిసి విజయవాడ వెళ్ళి వారిని ఒప్పించాము. ఆ సందర్భంలో విశ్వనాథ ఫోటోలు ఎన్నో తీసారు. (విశ్వనాథ శతాబ్ద్యుత్సవ సందర్భంలో పత్రికల వారికి ఆ ఫోటోలు అక్కరకు వచ్చాయి). ఆ ఉత్సవాలు ఆయన మార్గదర్శకత్వంలో ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాలలో (ఆయన ప్రిన్సిపాలు) రెండురోజుల పాటు జరిగాయి. మే 1968లో వరంగల్లు జిల్లా రచయితల మహాసభలూ అక్కడే జరిగాయి. ఉత్సవాలను ఏర్పరచటం, ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించి నిర్దుష్టంగా నిర్వహించటం ఆయనవల్ల నేర్చుకోవలసిన అంశం.

సోమేశ్వరరావుగారి జీవితంగా ఒక క్లిష్ట ఘట్టంలో అధికార రోగ పీడితులు అవ్యాజంగా ఆయనను నిందమోపి బాధించారు. అప్పుడు నిజంగానే ఆయన అరణ్యవాసం లాగా గడిపారు. అయినా, ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే ఆ జీవునిలో ఉన్న ప్రధానాంశం. అయినా, ఆ క్లిష్ట దశను దాటి మరింత ఉజ్జ్వలమైన స్థితిలోకి చేరుకున్నారు. ఆయన విద్యార్థిగా, ఆయనవల్ల ప్రేరణ పొందిన వానిగా నేను కోరదగింది  ఆయనకు నిరామయమైన శతమానం. 

 ‘భావసంధ్య’ నుంచి..

రచనా కాలం: 2007 జూన్ 24

- కోవెల సుప్రసన్నాచార్య