యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో మంగళ వారం నిత్య పూజా కైంకర్యాలు, ఆంజనేయునికి ఆకు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను వేదమంతోత్సవములు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు.
ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఆకు పూజ నిర్వహిస్తారు. ఈ ఆకు పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధుల గుండా స్వామి వారిని ఊరేగించారు.
స్వామివారి హుండీ 2,48,53,666/-
యాదగిరిగుట్ట దేవస్థానం హుండీ లెక్కింపును కొండ కింద వ్రతమంటపం హాల్ నెంబర్ 2 లో లెక్కించారు. 36 రోజుల హుండీ లెక్కింపు లో 2,48,53,666/- మొత్తం నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేశీయ కరెన్సీ తో పాటు 12 దేశాల విదేశీ కరెన్సీ సుమారు 50,000 వచ్చాయని, బంగారం, వెండి, నాణెములను మొత్తం లెక్కించడం జరిగిందని దేవస్థానం ఈవో భవాని శంకర్ తెలిపారు హుండి లెక్కింపును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






