31 August, 2026 | 10:03 AM

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

31-08-2026 08:48 AM

మల్లాపూర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): మల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకట్రావుపేట గ్రామంలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు. మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన పెద్రం భీమక్క (78) సుమారు ఇరవై ఏళ్ల క్రితం భర్త దూరం కావడంతో ఒంటరిగా జీవిస్తోంది.అదే గ్రామానికి చెందిన జర్పుల నాగమ్మ ఆమెను తన వద్దకు తీసుకువచ్చి అప్పటి నుంచి బాగోగులు చూసుకుంటోంది. సుమారు మూడేళ్ల క్రితం భీమక్కకు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమైంది.

అప్పటి నుంచి నాగమ్మ ఆమెకు సేవలు చేస్తూ సంరక్షిస్తోంది. అయితే మూడు రోజుల క్రితం నాగమ్మ అనారోగ్యానికి గురై వాల్గొండలో ఉంటున్న తన రెండో కుమార్తె వద్దకు వెళ్లే సమయంలో భీమక్క బాగోగులను గ్రామంలోనే ఉన్న తన పెద్ద కుమార్తె లక్ష్మికి అప్పగించింది.అయితే లక్ష్మి తన భర్త అనారోగ్యంతో ఉండటంతో ఆయనను రాయికల్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉందని, భీమక్కకు అన్నం పెట్టి వెళ్తున్నట్లు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం నాగమ్మ కుమారుడు జరుపుల తిరుపతి, పెద్ద కుమార్తె లక్ష్మికి ఫోన్ చేసి భీమక్క వద్దకు వెళ్లి చూడగా ఆమె గుర్రుమంటూ శబ్దాలు చేస్తూ కనిపించింది.

ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు రక్తగాయం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అనంతరం భీమక్కను మంచంపై పడుకోబెట్టగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న నాగమ్మ అక్కడికి చేరుకుని భీమక్క మృతదేహాన్ని పరిశీలించింది. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు మల్లాపూర్ ఎస్‌ఐ ఏ. అనిల్ తెలిపారు