31 August, 2026 | 3:27 AM

ప్రజలకు అండగా గులాబీ దండు

31-08-2026 02:36 AM
  1. కాంగ్రెస్ మోసాలను నిలదీద్దాం
  2. వెయ్యి రోజుల పాలనలో హామీలకు దిక్కులేదు
  3. ప్రతి వర్గానికి కాంగ్రెస్ బాకీలే
  4. సెప్టెంబర్ 2 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పోరుబాట

సిద్దిపేట, ఆగస్టు 30 (విజయక్రాంతి): అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ మోసాలను ప్రజల ముందు ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సమరశంఖం పూరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు (Former Minister, MLA Harish Rao) అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని హరీష్రావు విమర్శించారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు పూర్తవుతున్నా సంపూర్ణంగా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు భరోసా కల్పిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అన్ని వర్గాలను ఆగం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు.

సెప్టెంబర్ 2న ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పేరుకుపోయిన బకాయిలను గుర్తుచేస్తూ ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పంపిణీ చేపట్టాలని సూచించారు. రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, దళితులు, బీసీలు, గిరిజనులు తదితర వర్గాలకు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. సెప్టెంబర్ 3న వ్యవసాయం, సాగునీటి రంగంలో ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు,

4న పెన్షన్లు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర అంశాలపై వంటావార్పు, 5న జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యపై నిరసనలు నిర్వహించాలని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

6న సిద్దిపేట పట్టణంలో ఆటో ర్యాలీ, 7న ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులంతా కదిలి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని హరీష్రావు కోరారు. కేవలం హామీల వైఫల్యాలకే పరిమితం కాకుండా.. వెయ్యి రోజుల పాలనలో ప్రతి రంగంలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజల ముందుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.