20 March, 2026 | 4:14 AM

తండ్రీ, కూతురు సజీవ దహనంపై పోలీసుల ముమ్మర విచారణ

20-03-2026 12:50 AM

కాజీపేట, మార్చి 19 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో బుధవారం తెల్లవారుజామున జరిగిన తండ్రి కూతురు సజీవ దహన సంఘటనపై పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు. తండ్రి రాజశేఖర్ (54) ఆయన కుమార్తె రాజశ్రీ (24) అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అయ్యారు. హైదరాబాదులో నివాసముండే రాజశ్రీ ప్రవీణ్ దంపతులు రెండు రోజుల క్రితమే కడిపికొండకు వచ్చినట్లు తెలిసింది.

వీరికి ఇద్దరు సంతానం కాగా కూతురి అన్నప్రాసన కార్యక్రమం కోసం వచ్చినట్లు సమాచారం. అన్నప్రాసన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే రాజశేఖర్, కూతురు రాజశ్రీ మంటల్లో కాలిపోయారు.

ఘాతుకానికి ఒడిగట్టింది అల్లుడే?

కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుత్తితో మామను, భార్యను హత్య చేసిన అనంతరం, దానిని అగ్నిప్రమాదంగా చిత్రీకరించేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. భార్యపై అనుమానంతో భర్త ప్రవీణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, అడ్డు వచ్చిన మామను కూడా హతమార్చాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసులు ప్రవీణ్ ను అందులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సీఐ కిషన్ మృతుల బంధువులతో సంఘటనపై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంఘటన స్థలిని పరిశీలించి సాంకేతిక ఆధారాలను సేకరించారు.