25 March, 2026 | 1:58 AM

మత్తు మాయలో పడొద్దు యువత భవిష్యత్తును కాపాడుకోండి

25-03-2026 12:23 AM

యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో పోలీసు అధికారుల హెచ్చరికలు

కల్లూరు,మార్చి 24,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్త్స్ర హరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మత్తు పదార్థాల ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఫోర్స్ టీం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ హాజరై ఆయన మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు.  చెడువారితో స్నేహం చేయడం యువతను తప్పుదోవ పట్టిస్తుందని, డబ్బు కోసం కొంతమంది యువతను మత్తు వ్యసనాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తారని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. 

గంజాయి వంటి మత్తు పదార్థాల కేసుల్లో 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేస్తే సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.  పిల్లల భద్రత కోసం చైల్డ్లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పులి సాంబశివుడు, సిడిపిఓ నిర్మల జ్యోతి, డిఆర్‌ఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.