పెద్దపల్లి జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంలలో భద్రత కట్టుదిట్టం
అనుమానితులపై పోలీస్ ల ప్రత్యేక నిఘా
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంలలో పోలీస్ లు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ, గోదావరిఖని ఏసిపి ఆదేశాల మేరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాట్లు గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. గోదావరిఖని 1- 2-టౌన్, రామగుండం సర్కిల్, మంథని సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో గోదావరిఖని1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆఫ్జలోద్దీన్,2-టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, మంథని సీఐ రాజు, రామగుండం సీఐ కృష్ణకుమార్‌లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వివరాలను సేకరించారు. నేర నియంత్రణలో భాగంగా బ్యాంకులు మరియు ఏటీఎం కేంద్రాల్లో అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలని, హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను కూడా పరిశీలించారు.
ఏదైనా నేరం జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సులభంగా గుర్తించవచ్చని, అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడానికి వీటి ఉపయోగం ఎంతో ఉంటుందని పోలీస్ అధికారులు బ్యాంకు నిర్వాహకులకు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బ్యాంకుల భద్రత కోసం సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు, సరిపడా లైటింగ్, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు వంటి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
బ్యాంకు ఆవరణ మొత్తం కవరయ్యేలా కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ భద్రతను కచ్చితంగా పాటించాలని తెలిపారు. అలాగే బ్యాంకులకు వచ్చే కస్టమర్లలో ఎవరైనా అనుమానాస్పదంగా ఎక్కువసేపు ఉన్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.బ్యాంకు నుండి నగదు ఉపసంహరించుకుని వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కస్టమర్లకు అవగాహన కల్పించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.






