19 August, 2026 | 10:21 AM

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు

19-08-2026 09:44 AM

దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి

అటవీ అనుమతుల సమస్యలతో అభివృద్ధి పనులు, రైతులు ఇబ్బందులు పడకుండా పరిష్కరించాలి

అమృత్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించాలి

దిశా కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు  తీసుకోవాలని దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఖమ్మం ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ రామ సహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన దిశా కమిటీ సర్వసభ్య సమావేశాన్ని మహబూబాబాద్ ఎంపీ పి. బలరాం నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లతో  కలిసి  నిర్వహించారు. ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, విద్య, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, జాతీయ రహదారులు, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ ల, తదితర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రులకు అవసరమైన సిటీ స్కాన్ వంటి వైద్య పరికరాల కొనుగోలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అవసరమైన వైద్య పరికరాల కోసం సంబంధిత ప్రజాప్రతినిధులు సీఎస్ఆర్ నిధులను సమీకరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని, దీనిపై నివేదిక సమర్పించి ప్రభుత్వ స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.

జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన అర్హులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు. గుండాల ఘటనకు ఎవరు బాధ్యులో, ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో పూర్తి వివరాలతో డీఎంహెచ్ఓ 48 గంటల్లో కలెక్టర్‌కు యాక్షన్ టేకన్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. పనుల మంజూరు లేదా నిధులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, నిధుల కోసం తాము ప్రభుత్వ స్థాయిలో ఫాలోఅప్ చేస్తామన్నారు. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని, అవసరమైన హ్యాండ్‌పంపుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్‌లకు ప్రతిపాదించిన పనుల ప్రస్తుత స్థితిపై నివేదిక సమర్పించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించాలని సూచించారు.గురుకులాలను సందర్శించిన సమయంలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, గుడ్లు వంటి సరుకులు తగినంతగా లేవని గుర్తించినట్లు ఎంపీ తెలిపారు. టమాటాలను ఎలుకలు కొరికిన పరిస్థితిలో ఉన్నాయని, సరుకుల బ్యాగులు తెరిచి ఉంచారని, నిర్దేశించిన డైట్‌లో 50 శాతం కూడా అమలు కావడం లేదని, మూడు రోజుల పాటు ఒకే కూర వడ్డించిన పరిస్థితిని గమనించినట్లు చెప్పారు.

జిల్లాలోని అన్ని గురుకులాలు, పాఠశాలల జాబితాను సిద్ధం చేసి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి వారం కనీసం ఐదు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణ ప్రాంతాలకు పీఎంఏవై కింద మంజూరైన 1,590 ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సమర్పించాలన్నారు. పీఎంఏవై చెల్లింపులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యాత్మక కేసుల వివరాలను ప్రత్యేకంగా నివేదించాలని సూచించారు.కొత్తగూడెం వంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్‌కు అమృత్ స్టేషన్ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, ఈ విషయాన్ని తాను రైల్వే మంత్రికి కూడా తెలియజేసినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి మార్పిడి చేయడంతో పాటు భూమి విలువను కూడా చెల్లించినప్పటికీ, రెండేళ్లు గడిచినా రైల్వే భూమిని రాష్ట్రానికి అప్పగించలేదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ అనుమతుల కారణంగా విద్యుత్ లైన్లు, రహదారులు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డీఎఫ్‌ఓలు స్థానిక ఎమ్మెల్యేలతో సమయం కేటాయించి సమస్యలను నమోదు చేసుకుని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహబూబాబాద్ ఎంపీ పి. బలరాం నాయక్ మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మంత్రులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థాయి నుంచి సంపూర్ణ నివేదిక అందలేదని తెలిసిందని, అవసరమైన వైద్య పరికరాలు, ఇతర అవసరాలకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని కోరారు. విద్య, వైద్యం, రైల్వేలు తదితర రంగాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి తాము నిరంతరం కేంద్ర మంత్రులతో ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖకు అవసరమైన నిధుల కోసం కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

జిల్లాలోని 124 ఐసోలేటెడ్ హ్యాబిటేషన్లకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్న నేపథ్యంలో రహదారులు, త్రాగునీరు, ఇతర మౌళిక వసతుల కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అన్నారు. అటవీ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, పోడు రైతులు తమ పశువులను అడవిలోకి తీసుకెళ్లినప్పుడు రోజుల తరబడి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తెల్ల వెంకట్రావు, ఐటిడిఏ పిఓ రాహుల్, కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్డిఓ విద్యా చందన, మునిసిపల్ చైర్ పర్సన్లు, దిశ కమిటీ సభ్యులు, సర్పంచ్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.