19 August, 2026 | 12:00 PM

బీజేపీ నేతలు మారరు... గ్రూప్ రాజకీయాలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

19-08-2026 11:25 AM

హైదరాబాద్: బీజేపీ నేతలపై(Telangana BJP) ఎమ్మెల్యే రాజా సింగ్(MLA Raja Singh) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదని రాజాసింగ్ ఆరోపించారు. గతంలో పెద్ద నాయకులకు జాతీయ కార్యవర్గంలో మంచి పదవులు ఇచ్చారని, ఆ పదవుల్లో వారు మంచిగా పని చేశారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఒకరికి కూడా అవకాశం ఇవ్వలేదంటే తెలంగాణ బీజేపీ అగ్ర నాయకులు ఆలోచించాలని సూచించారు. తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు చేసి, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసుకోవడంపై మండిపడ్డారు. 

దేశం మొత్తంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్(BJP National President Nitin Nabin) కొత్త సైన్యం తయారుచేశారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా అయ్యి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సైన్యం తయారు చేశారని చెప్పారు. తెలంగాణ బీజేపీ పెద్దలు గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి మనం అదరం ఒక్కటే, మన లక్ష్యం ఒక్కటే అనే విధంగా పనిచేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్(West Bengal) వంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే దానికి కారణం అక్కడి నేతలు గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి పనిచేశారని సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంపై తెలంగాణ నేతలు మారరు..అని అధిష్ఠానం ఆలోచన చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఒకటేనని నిరూపించుకోవాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై టీ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.