29 June, 2026 | 2:01 AM

73,570 పిల్లలకు పోలియో చుక్కలు

29-06-2026 12:00 AM

మహబూబాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ తెలిపారు. 0 - 5 ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని, ఎవరైనా ఇప్పటివరకు పోలియో చుక్కలు

వేయించకపోతే మరో మూడు రోజులలో జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు గిరిజన తండాలలో వైద్య సిబ్బంది ఈ చుక్కల మందును అందిస్తారన్నారు. జిల్లాలో 469 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి, 76,660 మంది పిల్లలకు గాను73,570 వేసినట్లు అనగా 96 శాతం వేసినట్లుగా డీఎంహెచ్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్మన్ జ్యోతి , వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శివకుమార్ , డిప్యూటీ డెమో రాజ్ కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్వామి, పురుషోత్తం, శ్రీనివాస్  పాల్గొన్నారు.

భూపాలపల్లి జిల్లాలో..

చిన్నారులు పోలియో మహమ్మారి బారినపడకుండా  కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనివార్య కారణాలు కారణంగా పోలియో  చుక్కలు వేయించలేకపోయి న వారి కోసం ఈ నెల 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.