calender_icon.png 19 February, 2026 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయం దక్కే దెన్నడు?

17-02-2026 12:00:00 AM

 దుప్పటి మొగిలి :

20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం :

ఒకవైపు బిలియనీర్లు అంతరిక్షంలో పర్యటనలు చేస్తుంటే మరోవైపు కోట్లాది మంది కనీస ఆహారం, ఆరోగ్యం, వి ద్య కోసం పోరాడుతున్నారు. ఒకవైపు సాంకేతికతతో దూసుకుపోతుంటే మరోవైపు లక్షలాది మంది గ్రామాల్లో విద్యుత్తు, నీరు, ఆరోగ్య సదుపాయాలు లేక జీవిస్తున్నారు. ఇదే సామాజిక న్యాయం లేని అభివృద్ధి అసలు రూపం.

ఈ అసమానతలను గుర్తించి, ప్రపంచాన్ని సమానత్వ దిశగా నడిపించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20ను ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా  ప్రకటించింది. సామాజిక న్యాయం అంటే ధనాన్ని పంచడం మాత్రమే కాదు అవకాశాలను పంచడం. సామాజిక న్యాయం అంటే ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కు, నాణ్యమైన విద్య, ఆరోగ్య, న్యాయసేవలు అందుబాటులో ఉండాలి.

కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా వివక్ష ఉండకూడదు. ఒక దేశం అసలు అభివృద్ధిని కొలిచే ప్రమాణం జీడీపీ కాదు అక్కడి బలహీనుల జీవన ప్రమాణం. ప్రపంచంలో ఇప్పటికీ సామాజిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచంలో ఏడు వందల మిలియన్ల మంది తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నారు. కోట్లాది పిల్లలు విద్యకు దూ రంగా ఉన్నారు.

మహిళలు ఇప్పటికీ సమా న వేతనం పొందడం లేదు. వలస కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జాతి వివక్ష పూర్తిగా తొలగిపోలేదు. ఆఫ్రికా దేశాల్లో పేదరికం, ఆకలి తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. అభివృద్ధి ఉన్నా, న్యాయం ఇంకా పూర్తి కాలేదు.సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకుంటున్న  ప్ర పంచం సమానత్వం గురించి మాట్లాడుతుంది.

పనికిరాని నిబంధనలు..

మన దేశంలో సామాజిక సమానత్వం గురించి  తనను తాను నిజాయితీగా ప్రశ్నించుకుంటే ఇప్పటికీ రాజ్యాంగ వాగ్దానం మా త్రమే, కానీ సాధారణ పౌరుడి జీవితంలో సజీవ వాస్తవం కాలేదు. స్వాతంత్య్రం, రా జ్యాంగం అమల్లోకి వచ్చిన వజ్రోత్సవం పూర్తిచేసుకున్న కానీ ఈ దేశంలో ఒక మనిషి విలువ అతని ప్రతిభ ద్వారా కాకుండా కు లం ద్వారా నిర్ణయిస్తున్నారు. పేదవాడి భవిష్యత్తు అతని కృషి ద్వారా కాదు, పుట్టుక ద్వా రా నిర్ణయించబడుతోంది.

పుట్టుకతో వచ్చి న మచ్చ స్నానం చేసినా పోదు అనే సామెత మన సమాజంలో ఇప్పటికీ ఒక చేదు నిజం గా మిగిలి ఉంది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వ హక్కులు ఇచ్చింది. కానీ సమా జం అసమానతను అమలు చేస్తోంది. చట్టం ఒక మాట చెబితే వాస్తవం మరో మాట చెబుతోంది. ఈ విరుద్ధతే భారతదేశ సామాజిక  నిర్మాణంలో ఉన్న అతిపెద్ద విపత్తు. రాజ్యాంగంలోని ముఖ్యమైన నిబంధనలు సా మాజిక న్యాయానికి బలమైన పునాది.

ఆర్టికల్ 14 అనేది ప్రతి పౌరుడికి చట్టం ముం దు సమానత్వం, ఆర్టికల్ 15 అనేది కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష రద్దు, ఆర్టికల్ 17: అంటరానితనం రద్దు, ఆర్టికల్ 21: గౌరవంతో జీవించే హక్కు ఈ నిబంధనలు కేవలం చట్టపరమైన రక్షణ ఇచ్చినా సామాజిక న్యాయం మాత్రం ఎండమావే అయింది.                          

సమాజ దృక్పథమేది?

భారతదేశం ప్రపంచానికి యోగా నేర్పిం ది. శాంతి సందేశం ఇచ్చింది. కానీ ఇదే భారతదేశం, తన స్వంత ప్రజల మధ్య గోడలు కట్టింది. ఆ గోడల పేరు  కులం. గ్రహాలపై, చంద్రుడిపై అడుగుపెట్టిన దేశం, ఇంకా మనిషిని అతని జన్మ ఆధారంగా అంచనా వేస్తోం ది. భారతదేశంలో సామాజిక అసమానతల కు ప్రధాన కారణం కులం. శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థ నేటికీ సామాజిక హోదాను, ఆర్థిక అవకాశాలను ప్రభావి తం చేస్తోంది. రిజర్వేషన్లు వంటి రక్షణ కవచాలు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పో యింది.

కుల వివక్ష అనేది ఒక వ్యవస్థ. దేశం లో మహిళలకు సమాన హక్కులని ప్రభుత్వాలు చెబుతున్నా నేటికి ఒంటరిగా బయ టకు వెళ్లేందుకు జంకుతున్నారు. దేశంలో మహిళలు.. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రు లు, శాస్త్రవేత్తలుగా మారినప్పటికీ ఇంకా లక్షలాది మహిళలు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్నారు. అత్యాచారాలు, గృహహింస, బాల్య వివాహాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో బాధితులు న్యాయం కోసం పోరాడలేరు.

ఎందుకంటే సమాజం వారినే తప్పుపడుతుంది. ఇది కేవలం చట్ట సమస్య కాదు. ఇది ఒక సామాజిక సమస్య. సమాజం తన దృ క్పథాన్ని మార్చుకోవాలి. విద్య గొప్ప సమానత్వ సాధనం కావాలి. కానీ భారతదేశంలో విద్య మరింత అసమానతలను పెంచుతుంది. దేశంలో అందరికీ విద్య అందుతుం దా అంటే చెప్పలేని స్థితి. విద్య లేకపోతే అవకాశాలు రావు. అవకాశాలు లేకపోతే అభివృ ద్ధి ఉండదు. అభివృద్ధి లేకపోతే సమానత్వం అసాధ్యం.

విద్యాహక్కు చట్టం ఉన్నప్పటికీ అమల్లోనే లోపాలున్నాయి. వైద్య రంగంలో ఈ పరిస్థితి ఇంకా దారుణం. ధనికులకు ఆరోగ్యం ఒక హక్కు. పేదలకు ఆరోగ్యం ఒక అదృష్టం. ఒక పేదవాడు అనారోగ్యానికి గురైతే అతని కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుంది. ఆసుపత్రులు వ్యాపార కేంద్రాలు గా మారిపోయాయి. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని అంటుంటాం. కానీ నేడు ఆసుపత్రుల్లో ధనం లేకపోతే ప్రాణానికి కూడా రక్షణ లేదు. 

కొరవడిన న్యాయం ..

న్యాయ వ్యవస్థ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. కోర్టుల్లో కేసులు సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉంటాయి. ఒక పేదవా డు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కినప్పు డు, అతను న్యాయం కోసం కాదు, నిరాశ కోసం ప్రయాణం ప్రారంభించడమే అవుతున్నుది. ఈ పోరాటం సంవత్సరాల పాటు సాగినా న్యాయం దక్కదేమో అన్న భావన బలపడుతోంది. కోర్టుల్లో పెండింగ్ కేసులు కుప్పలుగా పేరుకుపోతున్న నేటి సమాజంలో సాధారణ, మధ్యతరగతి ప్రజలు త మ పనులు విడిచిపెట్టలేక, అటు కోర్టు మె ట్లు ఎక్కలేక అన్యాయానికి గురవుతున్నారు. అయితే ధనికులకు న్యాయం వేగంగా వస్తుంది. కానీ సాధారణ ప్రజలకు మాత్రం న్యాయం ఆలస్యంగా వస్తుంది. ఆర్థిక అసమానతలు కూడా సామాజిక న్యాయాన్ని దూరం చేస్తున్నాయి. 

దేశంలోని సంపదలో పెద్ద భాగం కొంతమంది చేతుల్లోనే ఉంది. సామాన్యులు కష్టపడుతున్నప్పటికీ అభివృద్ధి ఫలాలు వారికి చేరడం లేదు. దేశం లోని ఒక శాతం జనం వద్ద దేశ సంపదలో 40 శాతం కంటే ఎక్కువ ఉండగా.. దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో అనేకం తక్కువ సంపదతోనే జీవిస్తున్నారు.

అసమానతలు పెరిగితే, స మాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ప్రభుత్వాలు పథకాలు ప్రకటిస్తాయి. వాగ్దానాలు చేస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఎందుకంటే సమస్య పథకాల్లో లేదు దాని అమల్లో ఉంది. అవినీతి, నిర్ల క్ష్యం, బాధ్యతారాహిత్యం సామాజిక న్యా యాన్ని అడ్డుకుంటున్నాయి. అవినీతి ఒక క్యాన్సర్ లాంటిది. అది న్యాయాన్ని లోపల నుంచి నాశనం చేస్తుంది. 

బాధ్యతగా మెలగాలి..

మరి భారత్‌లో సామాజిక న్యాయం ఎప్పుడు వస్తుంది? రాజ్యాంగం వాగ్దానం చేసినప్పుడా లేక ప్రజలు పోరాడినప్పుడా అనేది ఆలోచించాలి. సామాజిక న్యాయం కోసం చట్టాలు సరిపోవు. చైతన్యం, మార్పు, బాధ్యత అవసరం. ప్రతి పౌరుడు ప్రశ్నించాలి, అవసరమైతే ఎదురు నిలబడాలి. అం తిమంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తోంది. సామాజిక న్యాయం ఒక వేడుక కాదు.

అది ఒక పోరాటం. భారత్ ఒక గొప్ప దేశం కావాలంటే, అది కేవలం ఆర్థికంగా కాదు, సామా జికంగా కూడా గొప్పగా ఉండాలి. ఎందుకంటే దేశం అసలు గొప్పతనం దాని సంపదలో కాదు న్యాయంలో ఉంటుంది. సమాజంలో అసమానతలు ఉంటే, అభివృద్ధి స్థిరంగా ఉండదు. కాబట్టి అభివృ ద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతున్న మన భారత్ సామాజిక న్యాయం సాధించాలని కోరుకుందాం.

 వ్యాసకర్త సెల్: 8466827118