పోషకాహార లోపాన్ని అధిగమించడమే పోషన్ పక్వాడ కార్యక్రమాల లక్ష్యం
అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్
వనపర్తి,(విజయక్రాంతి): చిన్నారులు, గర్భిణీలు,బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడమే పోషన్ పక్వాడ కార్యక్రమాల లక్ష్యమని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, డీఎస్పీ బాలాజీ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం, ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాసన, మరికొందరు చిన్నారులకు అక్షరాభ్యాస, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ గర్భిణి స్త్రీలకు, బాలింతలకు, నవజాత శిశువులకు పోషకాహార ప్రాధాన్యతను వివరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడమే పోషన్ పక్వాడ కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో పోషన్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోషకాహారంపైన అవగాహన కలిగి ఉండాలని, పోషకాహారం ద్వారానే ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమని తెలిపారు.
ఈ సందర్భంగా పోషణ్ పక్వాడ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి చేత పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన పోషకాహార స్టాల్స్ ను అధికారులు తిలకించారు. బాలామృతం తో చేసిన సున్నుండలు, పోషకాహార వంటకాలను చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో యాదయ్య, డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






