బ్యాటర్లు బాదితేనే..
ఐపీఎల్ మినీ వేలంలో పాట్ కమిన్స్‌కు ఇరవై కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసుకున్నప్పుడు.. అంతా ముక్కున వేలేసుకున్నారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం కోసం అంత డబ్బు వెచ్చించాలా అని విమర్శలు చేశారు. అయితే తెలివిగా పావులు కదిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. కోట్లు పెట్టి కొనుకున్న కమిన్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక అంతే అక్కడి నుంచి హైదరాబాద్ రాతే మారిపోయింది. లీగ్‌లో అత్యంత పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న జట్టుగా ముద్ర పడ్డ రైజర్స్.. బ్యాటింగ్ యూనిట్‌గా తీర్చిదిద్దిన కమిన్స్.. ఫియర్‌లెస్ క్రికెట్ పేరుతో ప్రతి ఒక్కరికీ బాదుడే పరమావధి అని హితబోధ చేశాడు. సుదీర్ఘ టీమ్ మీటింగ్‌లకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండే కమిన్స్ ఆటతీరుతోనే ప్రత్యర్థులను వణికిస్తామని చెప్పకనే చెప్పాడు. తాజా సీజన్‌లో టాస్ గెలిచిన జట్లు హైదరాబాద్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాలనే భయపడే పరిస్థితి నెలకొల్పాడు. ఆరు నెలల వ్యవధిలో వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియాకు కట్టబెట్టిన కమిన్స్.. ఇప్పుడు హైదరాబాద్‌కు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. సారథికి తగ్గట్లే ఆసీస్‌కే చెందిన ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా మోత మోగిస్తుండగా.. అభిషేక్ శర్మ పూనకం వచ్చినవాడిలా రెచ్చిపోతున్నాడు. ఈ ఇద్దరు పవర్‌ప్లే వరకు నిలిస్తే చాలు ఇక మ్యాచ్ మనవైపు మొగ్గినట్లే. చెపాక్ స్లో పిచ్‌పై మరి ఈ జోడీ ఏం చేస్తుందో చూ డాలి. రాహుల్ త్రిపాఠి, నితీశ్, క్లాసెన్, అబ్దుల్ సమద్‌తో రైజర్స్ మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. కీలక మ్యాచ్లో వీరం తా సమష్టిగా సత్తాచాటాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో కమిన్స్‌తో పాటు భువనేశ్వర్, నటరాజన్, ఉనాద్కట్ కీలకం కానుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.






