చెత్త డబ్బాలతో చైతన్యరథం
హుస్నాబాద్లో ప్రభాకర్ వినూత్న విన్యాసం
పరిశుభ్రతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన
హుస్నాబాద్, జూన్ 10: హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజల దృష్టిని ఆకర్షించింది. వార్డు సభలతో పాటు చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాల్లో 19వ వార్డుకు చెందిన పారిశుధ్య కార్మికుడు ప్రభాకర్ చెత్త డబ్బాలను ధరించి వినూత్నంగా అవగాహన కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని, పొడి చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో సందేశం అందించాడు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించగా, పరిశుభ్ర హుస్నాబాద్ లక్ష్యంగా ముందుకు సాగాలని చైర్పర్సన్ దండి లక్ష్మి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






