మందలపల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ
దమ్మపేట, జూన్ 04 (విజయక్రాంతి): మండల పరిధిలోని మందలపల్లి గ్రామ పంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ గ్రామ సర్పంచ్ గుజ్జులా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభకు డి ఆర్ డి ఓ పి. డి, రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవీంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు నీటి సౌలభ్యం కొరకు, మురుగునీరు నివారణ కొరకు చేయవలసిన పనుల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నందున డ్రైనేజీ వ్యవస్థ, ప్లాస్టిక్ వ్యర్ధాల నివారణ, తాగు నీరు నిల్వలపై చర్చించారు.
విద్యుత్ శాఖ నుండి ఎల్ ఐ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని విద్యుత్ అవసరాలు, విద్యుత్ సరఫరా, వారు చేసిన అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈఓ మాట్లాడుతూ పంట సాగుకాలం దగ్గర పడుతున్నందున రైతులు వ్యవసాయ శాఖ నుండి సూచనలు, సలహాలు తీసుకోవాలని, వరి, మొక్కజొన్న, దిగుబడులు పెంచే వర్షాధార పంటలను, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలోని విద్యాశాఖ నుండి ప్రైమరీ స్కూల్, జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన షెడ్డుగురించి ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మురళి, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మందలపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ ఇస్మాయిల్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం లు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.






