ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
– అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఆశతో దరఖాస్తులు సమర్పిస్తారని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.
అనంతరం అర్జిదారుల నుంచి పలు దరఖాస్తులను స్వీకరించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూర్‌నగర్‌కు చెందిన సాజిదాబేగం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. కెరమెరి మండలం ముఖద్దం గూడా గ్రామానికి చెందిన రాధోడ్ మనీషా గత సర్పంచ్ ఎన్నికల్లో తాను పోటీ చేసిన పత్రాలను అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం సాలేగూడా గ్రామానికి చెందిన ముంజం బాగుబాయి తనకు అనువంశికంగా వస్తున్న భూమిని ఇతరులు దౌర్జన్యంగా కబ్జా చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
కెరమెరి మండలం మహారాజ్ గూడా గ్రామానికి చెందిన రాధోడ్ విజయ్ తమ గ్రామంలో ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డుపై మళ్లీ సీసీ రోడ్ వేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన దుర్గం హోక్టు తన వ్యవసాయ భూమిలో బోరుబావి మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం ఈప్పల నవేగాం గ్రామానికి చెందిన మహమ్మద్ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జిదారులు, అధికారులు పాల్గొన్నారు.




