16 April, 2026 | 3:09 AM

పని ప్రదేశంలో జాగ్రత్తలు పాటించాలి

16-04-2026 01:37 AM

కలెక్టర్ కె. హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, ఏప్రి ల్ 15(విజయక్రాంతి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హరిత సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లా రం గ్రామ పంచాయతీ పరిధిలోని కంచర్‌గూడా గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు అంబలి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా తలకు రుమాలు కట్టుకోవడం, వేడి గాలుల నుండి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సూచించారు. పని ప్రదేశాల్లో త్రాగునీ రు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. ఈ కార్య క్రమంలో ఈజీఎస్ సిబ్బంది, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

అలాగే ప్రతి పౌరుడు రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాశాఖ అధికారి లలిత, జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

విద్యార్థులు రహదారి నిబంధనలను తమ తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధికారులు, పాఠశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉచిత కోచింగ్‌ను వినియోగించుకోవాలి

పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిసెట్, గురుకుల ప్రవేశ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలోని విద్యా వనరుల కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా విద్యాశాఖ అధికారి లలితతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పట్టుదలతో చదివి పాలిటెక్నిక్, గురుకుల కళాశాలల్లో సీట్లు సాధించి తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ప్రజాపరిషత్ బాలుర పాఠశాలను సందర్శించి మోడల్ పాఠశాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సెల్ టవర్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణాలను వేగవంతం చేసి మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్టెల్, జియో, టీ ఫైబర్ టవర్ల నిర్మాణాలు, స్థలాల ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ సమావేశానికి హాజరయ్యారు.

డిజిటల్ భారత్ నిధి కింద బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా జిల్లాకు 24 టవర్లు మంజూరయ్యాయని, వాటికి వెంటనే స్థలాల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ, ఫారెస్ట్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.