అప్పటికి గానీ గుర్తించలేకపోయారు!

06-05-2024 12:05:00 AM

ఒక్కటంటే ఒక్క సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది మలయాళీ అందం మమిత బైజు. అదీ ‘ప్రేమలు’ అనే ఒక అనువాద చిత్రంతో దర్శకుడు రాజమౌళి ఇది ముందుగానే ఊహించి ‘మమిత హార్ట్‌త్రోబ్’ అవుతుందని చెప్పారు. మరి మీ హర్ట్‌త్రోబ్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుసుకోవాలని ఉందా? విషయానికొస్తే.. తాజాగా మమిత పేరు వెనక గల కథ తెలియవచ్చింది. మమిత అసలు పేరు నమిత. మమిత తల్లిదండ్రులు ఆమె పుట్టినపుడు నమిత అని పేరు పెట్టారు. అయితే ఆసుపత్రి సిబ్బంది దానిని మమిత అని తప్పుగా రాసుకున్నారు. గమ్మత్తయిన విషయమేమిటంటే.. ఈ విషయాన్ని మమితను పాఠశాలలో చేర్చే వరకు ఆమె తల్లిదండ్రులు సైతం గుర్తించలేకపోయారట. తర్వాత జరిగిన తప్పిదాన్ని గుర్తించినా మమిత అనే పేరు కాస్త భిన్నంగా అనిపించిందని దాన్నే కొనసాగించారు. అదీ అసలు సంగతి! మమిత అంటే మిఠాయి అని అర్థం. మిఠాయి మీద ‘ప్రేమలు’ కురిపించని వారెవరుంటారు..? ఇంక ఆమె సినిమాల విషయానికొస్తే.. మమిత గత సినిమాలను కొన్ని ఓటీటీ వేదికలు కొనుగోలు చేస్తున్నాయంటే ఆమెకు గల క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తొలి నుండి మలయాళ చిత్రాలు చేస్తూ వస్తున్న మమిత, జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన ‘రెబల్’ చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తెలుగులోనూ పలువురు దర్శక నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు.