మరో ఉద్యమానికి సిద్ధం!
- సింగరేణి బొగ్గు గని వేలంతో కార్మికుల్లో గందరగోళం
కోల్‌బెల్ట్ పరిధిలోని ఎమ్మెల్యేలపై పెరుగుతోన్న వ్యతిరేకత
ఐక్య ఉద్యమాలకు జత కడుతున్న కార్మిక సంఘాలు
రామగుండం/మంథని, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణకు కొంగుబంగారం గా ఉన్న సింగరేణి కంపెనీలో అందరూ ఊహించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం కొత్త వివాదానికి తెరలేపింది. బొగ్గు గనుల వేలానికి పెట్టడం సింగరేణి వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. పాత రోజుల మాదిరి నల్లనేల మళ్లీ ఉద్యమాలకు వేదిక కానుందా అంటే కార్మిక సంఘాలు ఔననే అంటున్నాయి.
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్ వేదికగా బొగ్గు గనుల వేలం నిర్వహించడం ఇటు రాష్ట్రంలోని కోల్‌బెల్ట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు వ్యతిరేకత చుట్టుముట్టబోతోంది. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న మందమర్రి ఏరియాలోని బొగ్గు బ్లాకును వేలం వేయడమే ఇందుకు కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం
మరోవైపు కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలకు జత కడుతుండగా ఐఎన్‌టీయూసీ మాత్రం నోరు మెదపకుండా తటస్థంగా ఉంది. ఈ బొగ్గు గనుల వేలం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఒక్కసారిగా కోల్‌బెల్ట్ ఏరియాలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. బొగ్గు పరిశ్రమకు రక్షణగా ఉన్న గనుల జాతీయీకరణ చట్టం 2018లో కేంద్రం రద్దు చేసింది. ప్రధాని మోదీ 2020లో కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదికన బొగ్గు గనులను కేటాయించే వేలానికి శ్రీకారం చుట్టారు. దాంతో కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేటుపరమయ్యాయి. తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 70 మిలియన్ టన్నుల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి రికార్డు సృష్టించింది. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాదని కేంద్రప్రభుత్వం గనులను వేలం వేయడం ప్రైవేటుకు కట్టబెట్టారని సింగరేణి కార్మిక వర్గం భావిస్తున్నది. దీనితో గత ప్రభుత్వ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగాల్లో చేరిన దాదాపు 20వేల మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని స్వయంగా కార్మిక సంఘాల నాయకులే వాపోతుండటం మరింత ఆందోళనకు తెరలేపింది.
ఉద్యమానికి సిద్ధం!
విదేశీ కంపెనీలతో సమానంగా పోటీ పడుతున్న సింగరేణి సంస్థకు న్యాయంగా దక్కాల్సిన మందమర్రి ఏరియాలోని బొగ్గు గనిని ప్రైవేటుకు అప్పగించడంను చూస్తుంటే భవిష్యత్‌లో సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటుపరం అవుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయబోమని గతంలో రామగుండం సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రకటించిన నెల రోజులకే బొగ్గు బ్లాకులు వేలానికి ఆదేశించడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా మోదీ సర్కారుపై వ్యతిరేకత రాగా పార్లమెంట్ ఎన్నికలతో అంతా మరచిపోయారు.
ఇప్పుడు ఏకంగా సింగరేణి బొగ్గు గనిని వేలంలో చేర్చడం కార్మికవర్గంలో అభద్రతా భావానికి దారి తీసింది. మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బొగ్గు గనిని గతంలోనే వేలం వేయాలని చూస్తే అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ నిరాహార దీక్ష చేసి అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు వేలం ద్వారా ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుండటం ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకూ చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఈ వేలాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకోకపోవడం వల్ల జనంలో ముఖ్యంగా కార్మికుల్లో వ్యతిరేకత పొడచూపుతున్నది. ఆ బొగ్గు గనిని వేలం ద్వారా గాకుండా నేరుగా సింగరేణి సంస్థకే కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
గడ్డు కాలమే: మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రేవంత్‌రెడ్డి సర్కారు వంత పాడటం వల్ల రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థకు గడ్డుకాలాన్ని ఎదుర్కోనుంది. బీఆర్‌ఎస్ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 20వేల మంది కార్మికులతో పాటు ఇప్పుడు ఉద్యోగాల్లో చేరబోతున్న యువ కార్మికుల ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. సంస్థకే ఎసరు పెట్టేందుకు పెద్ద కుట్రనే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. గనుల వేలాన్ని అడ్డుకునేందుకు కలిసి వచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.






