19న పత్రీజి డాక్యుమెంటరీ ప్రదర్శన
ఆదిలాబాద్,(విజయక్రాంతి): పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పత్రీజీ డాక్యుమెంటరీ (‘బ్రహ్మర్షి పత్రీజీ - ది కంప్లీట్ మ్యాన్’) చిత్రాన్ని ఆదిలాబాద్ నటరాజ్ థియేటర్ లో ఈ నెల 19న ఉదయం 8 గంటలకు ప్రదర్శించబడుతుందని ఆదిలాబాద్ అధ్యక్షులు తాటి సంతోష్ శుక్ర వారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ చిత్రంలో 1990 నుంచి 1999 మధ్యకాలంలో పత్రీజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వార ధ్యానము, శాకాహార ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తట్టి లేపడం జరిగిందన్నారు. ‘ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి.’ అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు విధిగా ధ్యానం చేయాలని, శాకాహారులుగా ఉండాలని తెలియజేయడం జరిగిందన్నారు.
ప్రతి సంవత్సరం ధ్యాన మహా చక్రాల ద్వారా, ధ్యాన మహా యాగాల ద్వారా, ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని ఎంతోమంది మాస్టర్లకు అందజేస్తున్నామని, ఆధ్యాత్మికతలో శిష్యులుగా కాకుండా గురువులుగా ఎదగాలని ఆయన ఎప్పుడు తపించేవారన్నారు. ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఆయన చేసిన కృషిని అభినందిస్తూ, సమాజానికి ఇలాంటి గురువుల జ్ఞానం ఎంతైనా అవసరం ఉంటుందననే భావనతో ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా పత్రీజీని, ఆయన చేసిన సేవలను సమాజానికి పరిచయం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొందాలని కోరారు. ఈ సమావేశంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆదిలాబాద్ కార్యదర్శి సుంకర రమేష్, గౌరవ అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.






