మీ హయాంలోనే..
- అవంతిక, అరబిందోలకు బొగ్గు బ్లాక్‌లను విక్రయించలేదా?
కేటీఆర్ ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ట్వీట్
మీరు ఉన్నప్పుడు ఏం చేశారు?
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): బొగ్గు గనుల వేలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లడాన్ని తప్పుపడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. ‘కేటీఆర్ గారు.. 10 ఏళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజలు మాట్లాడిన మాటలను వినడానికి మీరు ఇంట్రెస్ట్ చూపలేదు. కాబట్టి మీరు ఇప్పుడు వాస్తవాలను వినడానికి శ్రద్ధ చూపే చాన్స్ లేదు. కానీ తాము వినడానికి ప్రయత్నిస్తున్నాం.
తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, క్యాడర్ అంతా కేంద్ర ప్రభుత్వం లేదా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటీకరణ లేదా మన వాటాలను విక్రయించడాన్ని వ్యతిరేకించారు. సింగరేణి బ్లాక్‌లను విక్రయించే మొదటి, రెండో విడుతలను కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు విక్రయించారు. ఈ అంశంపై మీరు లేదా మీ పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు.
మా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి బ్లాకులను ప్రయివేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించడమే కాకుండా అవంతిక, అరబిందోలకు విక్రమించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయి. మన బొగ్గు మాత్రమే కాకుండా మన ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడుతాం. సింగరేణి, ఓఆర్‌ఆర్ కలెక్షన్ల హక్కులను అమ్మిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు’ అని కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.






