12 May, 2026 | 9:46 AM

వేలంపై రేవంత్ మౌనమెందుకు?

22-06-2024 12:15 AM
  1. నాడు వ్యతిరేకించి నేడు సమర్థిస్తారా?
  2. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ప్రశ్న

* తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా మొత్తం సింగరేణి సంస్థ ప్రైవేట్‌పరం అవుతుంది. అంతేకాకుండా పెట్టుబడుల ఉపసంహరణకు దారి తీస్తుంది. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అంగీరిస్తున్నారో లేదో తెలియజేయాలి. 

 బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. నేడు సీఎంగా ఎందుకు వ్యతిరేకించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేంద్రం నేరుగా కేటాయించాలని మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. వేలంపాటకు డిప్యూటీ సీఎంను పంపడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని తలపిస్తుందన్నారు. గనుల వేలం విషయంలో తన వైఖరి ప్రజలకు వివరించాలని, దీని వెనుక ఉన్న ఒత్తిళ్లను తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా మొత్తం సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని, అంతేకాకుండా పెట్టుబడుల ఉపసంహరణకు దారి తీస్తుందనే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అంగీరిస్తున్నారో లేదో తెలియజేయాలన్నారు. గుజరాత్, ఒడిశా మాదిరిగానే తెలంగాణలోని ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి గనులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదు? కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర సర్కారు ఎందుకు ప్రశ్నించలేక పోతుందన్నారు. సింగరేణి గొంతు కోసేలా శుక్రవారం వేలంపాట కార్యక్రమంలో ఉన్న రాష్ట్ర డిప్యూటీ సీఎంతోపాటు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఎలాంటి ఆందోళన లేకుండా పాల్గొనడంపైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణపై జరుగుతున్న ఈ కుట్రలో చిరునవ్వులు చిందిస్తూ పాల్గొనడం వారికి రాష్ట్రంపై ఉన్న ప్రేమను సూచిస్తుందంటూ ఎద్దేవా చేశారు.

కార్మికుల పొట్టకొట్టి వందేళ్ళ సంస్థ భవిష్యత్తును చీకట్లో నెట్టి పూల బొకేలతో నిస్సిగ్గుగా ఫొటోలకు ఫోజులిచ్చారని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ సింగరేణి సంస్థకు మరణ శాసనం రాసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల అటెన్షన్ డైవర్టు చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్ళి ఫిరాయింపుల డ్రామాకు రేవంత్‌రెడ్డి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఆర్నెల్ల క్రితం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు  చేయకుండా డ్రామాలను ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందన్న కేటీఆర్.. బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.